చింతామణి పట్నంలో ఏడు ఇళ్లలో చోరీ..

తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూర్ మండలం చింతామణి పట్నంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. తాళం వేసిన ఏడు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడటంతో గ్రామంలో కలకలం రేగింది.

వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి కిరాణా దుకాణం తాళం విరగొట్టి లోపల ఉన్న ఫ్రిజ్‌లోని నాలుగు బీర్ బాటిళ్లను దొంగలు తీసుకుని తాగి అక్కడే వదిలేశారు. అనంతరం పెద్ద మల్లప్ప, మేకలి వెంకటమ్మ, కప్పల లాలప్ప, కురువ మల్లప్ప, గౌడి విజయమ్మ, జీవి కొండ లక్ష్మప్ప తదితరుల ఇళ్లలో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు.

చోరీ జరిగిన సమయంలో ఇళ్ల యజమానులు ఎక్కువగా హైదరాబాద్‌కు ఉపాధి కోసం వెళ్లి ఉండగా, కొందరు కొత్త ఇళ్లలో లేదా ఇతర ప్రాంతాల్లో ఉండటంతో ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అయితే వెంకటప్ప తన ఇంటి నుంచి కొంత బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న ఎస్సై వినోద్ రాథోడ్ ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీంతో కలిసి పరిశీలించారు. వేలిముద్రలను సేకరించి ఆధారాలు సేకరించారు.

దొంగలు చింతామణి పట్నం నుంచి చెంగోలు, గౌతాపూర్ మార్గంగా తాండూర్ లేదా కర్ణాటక వైపు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా, చోరీ జరిగిన ఇళ్ల యజమానులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి నగదు, బంగారం నష్టం వివరాలపై విచారణ కొనసాగిస్తున్నారు.