సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
గిరిజన సంప్రదాయాల నడుమ వనదేవతల దర్శనానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు
తాడ్వాయి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ నెల 16న మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ వనదేవతల ప్రాంగణంలో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పోతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెలిప్యాడ్, కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా తొలుత మేడారం చేరుకుని సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాక సందర్భంగా హెలిప్యాడ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రత, వాహనాల రాకపోకలు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
సమ్మక్క–సారలమ్మ వనదేవతల ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై గుత్తేదారును వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ, అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పనులు పూర్తయిన వెంటనే మిగిలిపోయిన గ్రానైట్ రాళ్లు, నిర్మాణ వ్యర్థాలను తొలగించి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని గుత్తేదారునికి సూచించారు.
గిరిజన సంస్కృతి, సంప్రదాయాల నడుమ ముఖ్యమంత్రి వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆశీర్వచనాలు, శేషవస్త్రాల సమర్పణ, మొక్కులు చెల్లించడం తదితర కార్యక్రమాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందస్తు ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని ఆలయ ఈవోను ఆదేశించారు.
వనదేవతల ప్రాంగణం చుట్టుపక్కల తోటల పెంపకం, భూసుందరీకరణ చేపట్టి మొక్కలు నాటాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో గ్రానైట్ రాళ్లతో ఏర్పాటు చేసిన భారీ పీటీ బీమ్స్‌ను పూలతో ఆకర్షణీయంగా సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు.
ఆలయ ప్రాంగణం ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా కనిపించేలా సుందరీకరణ పనులను పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. వనదేవతల దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించనున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధం చేయాలని ఆదేశించారు.
సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని చోట్ల పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, వాహనాల నియంత్రణ, ప్రోటోకాల్, రాకపోకలు, ఆలయ పరిసరాల్లో భద్రత తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ జి, ఆర్డీవో కృష్ణవేణి, డీఎస్పీ రవీందర్, ఆలయ ఈవో వీరస్వామి, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యామ్ సింగ్, గుత్తేదారులు ఆదినారాయణ, తాడ్వాయి తహసీల్దార్ సురేష్ బాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
