రేపటి నుంచి ప్రత్యేక కుంకుమార్చనలు
- ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు
- శ్రావణమాసంలో కుంకుమార్చనలు
- కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు..
- ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆర్జిత సేవలు
- రూ.1,000 టికెట్‌పై ఇద్దరికి అవకాశం
- ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా బుకింగ్
- రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూజలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు ప్రత్యేక కుంకుమార్చన సేవలను నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్ తెలిపారు. ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 11 వరకు నెల రోజులపాటు పూజా మంటపంలో ఈ ఆర్జిత సేవలను వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా ప్రత్యేక కుంకుమార్చనలు జరుగుతాయని తెలిపారు.
సేవా టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించామని, ఒక టికెట్‌పై దంపతులు లేదా ఇద్దరు భక్తులు పూజలో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో టికెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మనమిత్ర’ వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా ఇంటి నుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.
అలాగే ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన డిజిటల్ టికెట్ కియోస్క్‌లు, దేవస్థానం ఆర్జిత సేవా కౌంటర్లలోనూ టికెట్లు లభిస్తాయని తెలిపారు. శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమార్చన సేవ నిర్వహించడం అత్యంత శుభప్రదమని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈవో శీనా నాయక్ కోరారు.
