గణిత ఉపాధ్యాయుడిని మార్చాలని ధర్నా

విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు కరుణాకర్ రెడ్డి సరిగా పాఠాలు బోధించడం లేదని ఆరోపిస్తూ, ఆయనను మార్చాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలో బోధన సక్రమంగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.

ధర్నాలో మాదిగ జేఏసీ నాయకులు రాయిశెట్టి ఉపేందర్, బీఆర్ఎస్వీ నాయకులు మాలిక్, నాగరాజు, తల్లిదండ్రులు పెరటి మురళి, కృష్ణారెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.