చోరీకి గురైన మొబైల్స్ రికవరీ
ఇద్దరు నిందితుల అరెస్టు..
రూ.1.50 లక్షల విలువైన ఫోన్లు స్వాధీనం
కరీమాబాద్, ఆంధ్రప్రభ: రైళ్లలో ప్రయాణికుల నుంచి చోరీకి గురైన మూడు మొబైల్ ఫోన్లను వరంగల్ జీఆర్పీ పోలీసులు రికవరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.1.50 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ జీఆర్పీ సీఐ వడ్డే నరేష్ కుమార్ కథనం ప్రకారం.. ఈ నెల 11న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వరంగల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారం నంబర్లు 2, 3 మధ్య నూతన ఫుట్‌ఓవర్ బ్రిడ్జి సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు కర్నూలు జిల్లా డోన్ మండలం పాతపేటకు చెందిన మాదిగ అరవింద్ (19), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం శ్రీనగర్ కాలనీకి చెందిన కోట జంపయ్య (26)గా గుర్తించారు.
వీరిని విచారించగా ఈ నెల 9న రాత్రి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడి నుంచి గూగుల్ పిక్సెల్-9 మొబైల్ ఫోన్‌ను చోరీ చేసినట్లు వెల్లడించారు. ఈ ఫోన్ విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
అదేవిధంగా ఇతర రైళ్లలో చోరీ చేసిన మరో రెండు మొబైల్ ఫోన్లు కూడా వారి వద్ద ఉన్నట్లు గుర్తించారు. మొత్తం మూడు మొబైల్ ఫోన్ల విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని సీఐ నరేష్ కుమార్ తెలిపారు.
పంచుల సమక్షంలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో పంచనామా నిర్వహించి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నిందితులను రిమాండ్ నిమిత్తం కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపరిచారు.
రైల్వే మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నిందితులను ఖమ్మం జిల్లా జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
