MEDICAL | సేవా భావంతోనే పరమార్థం…

MEDICAL | సేవా భావంతోనే పరమార్థం…

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : సమాజంలోని పేదలు అవసరమైన వారికి సేవ చేయడమే నిజమైన పరమార్థమని, దాతృత్వంతో కూడిన సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ లక్ష్యమని లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట అధ్యక్షురాలు సరిత హరిహర నారాయణ్ బట్టడ్ అన్నారు. ఈ రోజు మండలంలోని శ్యాసంపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేగా ఉచిత వైద్య శిబిరంలో (At a mega free medical camp) ఆమె మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని అన్నారు. హనుమాన్ దేవాలయం సమీపంలో నిర్వహించిన ఈ శిబిరంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డా. సునీతి గందె, జనరల్ ఫిజీషియన్ డా. కార్తీక్ గందె పర్యవేక్షణలో పిల్లలకు, మధుమేహ రోగులకు, గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, 400 మందికి పైగా మందికి వైద్య సేవలు అందించారు. తరువాత అందరికీ అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరి నారాయణ్ బట్టడ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని, లయన్స్ క్లబ్ సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి సాయినాథ్, కోశాధికారి రాధ సదానంద్ చారి, ఆత్మరాం, ఏడికే జోన్ చైర్మన్ ఉమాకాంత్ గందె, జనార్ధన్, వెంకటయ్య, సురేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.శిబిరం నిర్వహణలో గ్రామస్థులు, యువత సహకారం అందించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Leave a Reply