Mango | సీమ జిల్లాల్లో మామిడి జోరు.. సిండికేట్ల బెడదపై ప్రభుత్వ నజర్

Mango | సీమ జిల్లాల్లో మామిడి జోరు.. సిండికేట్ల బెడదపై ప్రభుత్వ నజర్

Mango | తోతాపురి, బేనీషా రకాలకే మార్కెట్‌లో అగ్రస్థానం
విదేశీ ఎగుమతులపై యుద్ధ వాతావరణ ప్రభావం
దళారీల సిండికేట్లతో రైతులకు నష్టం
గుజ్జు పరిశ్రమలపై కలెక్టర్ల సమీక్ష

Mango | తిరుపతి (రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో: ప్రకృతి వైపరీత్యాలు, దళారీ వ్యవస్థ, గుజ్జు పరిశ్రమల సిండికేట్‌ సమస్యలు, విదేశీ ఎగుమతుల ఇబ్బందుల నడుమ రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది మామిడి సీజన్‌ మొదలైంది. మొత్తం ఎనిమిది జిల్లాల్లో సుమారు 4 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నప్పటికీ, నాలుగైదు జిల్లాల్లోనే సాగు ఎక్కువగా కనిపిస్తోంది. ఏడెనిమిది రకాల మామిడి పండ్లు సాగవుతున్నా, వాణిజ్యపరంగా తోతాపురి, బేనీషా రకాలే అగ్రస్థానంలో ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈసారి ముందస్తుగా తీసుకుంటున్న చర్యలు రైతులకు కొంతమేర ఉపశమనం కలిగిస్తున్నాయి.

రాష్ట్రంలోని మామిడి తోటల్లో 35 నుంచి 40 శాతం వరకు రాయలసీమ జిల్లాల్లోనే ఉన్నాయి. రాయలసీమ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోనే అత్యధికంగా మామిడి సాగు కొనసాగుతోంది. గత నెలలోనే మొదలైన ఈ సీజన్‌ దాదాపు మరో రెండు నెలలపాటు కొనసాగనుంది.

ప్రతి ఏడాదితో పోలిస్తే ఈసారి రాయలసీమ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరిగింది. ఇందులో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు పైగా మామిడి సాగు కాగా, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో చెరో 20 వేల ఎకరాల చొప్పున సాగు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో సుమారు 4 వేల ఎకరాలు, నంద్యాల జిల్లాలో దాదాపు 9 వేల ఎకరాల్లో మామిడి సాగు అయినట్లు సమాచారం. నీలం, ఇమామ్‌ పసంద్‌, మల్లిక వంటి రకాలతో పాటు తోతాపురి, బేనీషా రకాలకే ఈసారి కూడా మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

ఇతర ప్రాంతాలకు ఎగుమతులపై ప్రభావం

సాధారణంగా రాయలసీమ ప్రాంతం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు మామిడి పండ్ల ఎగుమతులు జరుగుతాయి. అలాగే అమెరికా, యూరప్‌, గల్ఫ్‌ దేశాలకు కూడా పెద్దఎత్తున ఎగుమతులు ఉంటాయి. అయితే ఈ ఏడాది అమెరికా, ఇరాన్‌, ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం విదేశీ ఎగుమతులకు ఆటంకంగా మారుతోంది. దీంతో రైతులు ప్రధానంగా దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల్లోని అధికార, అనధికార కలెక్షన్‌ సెంటర్ల వద్ద వివిధ రాష్ట్రాల వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకున్న మధ్యవర్తుల సందడి పెరిగింది. సిండికేట్లుగా ఏర్పడిన దళారీలు గిట్టుబాటు ధరలను గణనీయంగా తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సగటున ఒక టన్ను మామిడి పండ్లపై రైతుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు నష్టం వాటిల్లుతుండగా, దళారీలకు రూ.10 వేల వరకు లాభం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని రైతు సంఘాల నాయకులు వాపోతున్నారు.

గుజ్జు పరిశ్రమలపై కలెక్టర్ల దృష్టి

ఇంకోవైపు దాదాపు 100 వరకు ఉన్న గుజ్జు పరిశ్రమలు రైతులతో ఒప్పందాల హడావుడి మొదలుపెట్టాయి. గత ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తమ వద్ద 2 లక్షల టన్నుల గుజ్జు నిల్వలు ఉన్నాయనే కారణంతో గుజ్జు పరిశ్రమలు కొనుగోలు ధరలను తగ్గించే ప్రయత్నం చేశాయి. ఆ సమయంలో ప్రభుత్వం రంగంలోకి దిగి కిలోకు రూ.4 చొప్పున రైతులకు సబ్సిడీ ఇచ్చింది. అయినా రైతులకు కిలోకు అతి కష్టం మీద రూ.8 మాత్రమే లభించింది.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కొన్ని జిల్లాల కలెక్టర్లు పరిశ్రమల యజమానులతో సమావేశాలు నిర్వహించారు. టన్నుకు సగటున రూ.12 వేలకన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయితే సాధారణంగా ఉండాల్సిన 20 టన్నుల గుజ్జు నిల్వలకంటే ఎక్కువగా, తమ వద్ద దాదాపు 40 టన్నుల నిల్వలు ఉన్నాయనే పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన గుజ్జు పరిశ్రమల యజమానులు ఆచితూచి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని యత్నిస్తున్న తరుణంలో మామిడి సీజన్‌ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దళారీల సిండికేట్లు, పరిశ్రమల మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చర్యలు తీసుకుంటే, ఈ ఏడాది రాయలసీమ మామిడి రైతులకు గణనీయమైన మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply