హైవేలో ప్రమాదాలపై చ‌ర్చ‌

హైవేలో ప్రమాదాలపై చ‌ర్చ‌

(తెలంగాణ నెట్ వ‌ర్క్ కోఆర్డినేట‌ర్‌, ఆంధ్రప్రభ‌) : హైద‌రాబాద్‌-బీజాపూర్ (Hyderabad-Bijapur) జాతీయ ర‌హ‌దారి డిజైన్ మార్పుతో ప్రమాదాలు నివార‌ణ అవుతుందా? వాహ‌న రాక‌పోక‌ల‌కు సౌక‌ర్యంగా ఉంటుందా? ఈ మార్పు ప్ర‌మాదక‌రంగా ఉంటుందా? అనేది ప్ర‌జ‌ల్లో ప‌లు అనుమానాల‌తోపాటు భ‌యాలు కూడా ఉన్నాయి. జాతీయ ర‌హ‌దారి అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్ఐఏ) డిజైన్ మార్పు చేస్తూ కొత్త ప్ర‌తిపాద‌న తీసుకొచ్చింది.

డిజైన్ మార్పు (Design change) ప్ర‌తిపాద‌న‌ను చెన్నై జాతీయ హ‌రిత ట్రిబ్యూన‌ల్‌కు స‌మ‌ర్పించిన‌ట్లు తెలిసింది. డిజైన్ మార్పుకు ఎన్‌హెచ్ఏఐ ప్ర‌తిపాద‌న‌లు ఇవ్వ‌డంతో జాతీయ హ‌రిత ట్రిబ్యూన‌ల్ కూడా తుదితీర్పు ప్ర‌క‌టించింది. చేవెళ్ల బ‌స్సు దుర్ఘ‌ట‌న రోజునే ఈ తీర్పు వెలువ‌డింది. అయితే డిజైన్ మార్పు ఎలా ఉంటుందో అనేది ఎన్‌హెచ్ఏఐ స్ప‌ష్టం చేయ‌లేదు.

కానీ డిజైన్ మార్పుపై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ మాత్రం కొన‌సాగుతోంది. మ‌ర్రి చెట్లు య‌థాస్థానంలో ఉంచి రోడ్డు నిర్మించాలంటే ప్ర‌తి ఒక్క‌రి ఊహ‌ల్లోకి సెంట‌రింగ్‌లో చెట్లు ఉంచి, ఇరువైపులా రోడ్డు నిర్మించాల‌న్న‌దే ఎన్‌హెచ్ఏఐ (NHAI) ప్ర‌ధాన ఉద్దేశం అని ప‌లువురు భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని కూడా ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు లేక‌పోలేదు.

హైద‌రాబాద్-బీజాపూర్ (ఎన్‌హెచ్‌-163) జాతీయ ర‌హ‌దారి నాలుగు లైన్ల ఏర్పాటుకు జాతీయ ర‌హ‌దారి అభివృద్ధి సంస్థ‌కు కేంద్రం రూ.780 కోట్లు మంజూరు చేసింది. ఈ అభివృద్ధి ప‌నుల్లో భాగంగా హైద‌రాబాద్ సిటీ (Hyderabad City) స‌మీపాన అప్పా జంక్ష‌న్ నుంచి మ‌న్నెగూడ వ‌ర‌కూ ఉన్న 46 కిలోమీట‌ర్లలో 915 మ‌ర్రి చెట్లు ఉన్నాయి. రోడ్డు అభివృద్ది చేస్తే ఈ మ‌ర్రి చెట్ల‌ను తొల‌గించాల్సి ఉంది. అయితే మ‌ర్రి చెట్లు తొల‌గిస్తే ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటుంద‌ని ప్ర‌కృతి ప్రేమికులు ఉద్య‌మాన్ని ప్రారంభించారు.

ఈ మ‌ర్రి చెట్లలో సుమారు వంద నుంచి రెండు వంద‌ల వ‌రకూ వయసు ఉన్న చెట్లు ఉన్నాయ‌ని ప్ర‌కృతి ప్రేమికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో చెన్నై జాతీయ హ‌రిత ట్రిబ్యూన‌ల్ (National Green Tribunal, Chennai) లో 2021వ సంవ‌త్సరం కేసు వేశారు. ఈ కేసు కార‌ణంగా ఈ జాతీయ ర‌హ‌దారిని విస్త‌రించ‌లేక‌ పోయారు. డిజైన్ మార్పున‌కు ఎన్‌హెచ్ఏఐ నిర్ణ‌యించింది. డిజైన్ మార్పు ప్ర‌తిపాద‌న అక్టోబర్ 31న ఎన్‌జీటీలో కేసు విచారణ సందర్భంగా ఎన్‌హెచ్‌ఏఐ ఈ ప్రతిపాదనను సమర్పించింది. కోర్టులో కేసులు వేసిన వారితో ప్ర‌భుత్వ పెద్ద‌లు కూడా చ‌ర్చ‌లు జ‌రిపారు.

భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌కు వెళ్లొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశార‌న్న స‌మాచారం ఉంది. ఎన్‌హెచ్ఏఐ అఫిడవిట్ మేర‌కు 150 చెట్ల‌ను తొల‌గించే అవ‌కాశాన్ని ట్రిబ్యూన‌ల్ క‌ల్పిస్తూ తీర్పు ఇచ్చింది.
హైద‌రాబాద్ సిటీ స‌మీపాన అప్పా జంక్ష‌న్ నుంచి మ‌న్నెగూడ వ‌ర‌కూ మ‌ర్రిచెట్లు ఉన్నాయి. ఈ మ‌ర్రి చెట్ల మ‌ధ్య‌లో ఉంచి ఇరువైపులా ర‌హ‌దారి నిర్మించ‌డం ఎన్‌హెచ్ఏఐ వ‌ద్ద ఉన్న ప్ర‌తిపాద‌న‌. ఇదే జ‌రిగితే మ‌రిన్ని ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు లేక‌పోలేదు.

1) ఎప్పుడైనా జాతీయ ర‌హ‌దారి క‌నీసం అర కిలోమీట‌ర్ దూరంలో ఉన్న ఏ వాహ‌నం అయినా క‌నిపించే విధంగా ఉండాలి. అయితే ఈ ర‌హ‌దారిలో మ‌లుపులు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల అది సాధ్య‌ప‌డ‌దు.
2) ఇక్క‌డ ఉన్న‌ మ‌ర్రి చెట్ల వ‌య‌స్సు వందేళ్ల పైబడి ఉన్నాయి. దీనివ‌ల్ల మ‌ర్రి చెట్ల‌కు ఊడ‌లు బాగా పెరిగి, తిరిగి భూమిలోకి పాతుకు పోయాయి. ఊడ‌లు భారీ వాహ‌నాల‌కు త‌గ‌ల‌డంవ‌ల్ల ప్ర‌మాదాల‌కు గుర‌య్యే అవ‌కాశాలు ఉంటాయి.
3) మ‌ర్రిచెట్లు చుట్టూ చ‌ల్ల‌ద‌నం కోసం స‌మీప ప్ర‌జ‌లు చేరుతుంటారు. గ్రామం నుంచి సెంట‌ర్‌లో ఉన్న మ‌ర్రి చెట్టు వ‌ద్ద‌కు చిన్న పిల్ల‌లు, వృద్ధులు, మ‌హిళ‌ల రాక‌పోక‌లు కూడా జరుగుతుంటాయి.
దీనివ‌ల్ల కూడా ప్ర‌మాదాలు పెరిగే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌తి గామం వ‌ద్ద ఫ్లైఓవ‌ర్ క‌ట్టేందుకు అవ‌కాశం కూడా ఉండ‌దు. దీనివ‌ల్ల గ్రామీణులు ర‌హ‌దారి మీదుగా అటు ఇటు రాక‌పోక‌లు చేస్తారు. అది కూడా ప్ర‌మాద‌క‌ర‌మే.
4) మర్రి చెట్ల కింద చ‌ల్ల‌ద‌నం, ప‌చ్చ‌ద‌నం ఉంటే ఆవులు, గేదెలు, ప‌శువులు అక్క‌డ‌కు చేరే అవ‌కాశం ఉంది. వాటి రాక‌పోక‌ల వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంటాయి. ఇప్ప‌టికే ఈ స‌మ‌స్య కోల్‌క‌త్తా-చెన్నై జాతీయ ర‌హ‌దారిలో ఉంది.
5) మ‌లుపులు కూడా ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల, ఆ మలుపుల ప్రకారమే రోడ్డు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీనివ‌ల్ల వంద కిలోమీట‌ర్ల స్పీడ్ తో వ‌చ్చే వాహ‌నాలు ప్ర‌మాదాల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంది.


అనేక ప్రాంతాలను కలిపే వారధి…రహదారి. నిర్మించడానికి ఏడాదో, రెండేళ్ళో పట్టొచ్చు. కానీ అది కలకాలం నిలిచి ఉండాలంటే మాత్రం నిర్మాణానికి ముందే ప్రయాణికుల భద్రత పై సమగ్ర సర్వే చాలా అవసరం. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఎన్ హెచ్ ఏ ఐ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.