తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సీఎం మాట్లాడుతూ .. ఎంతటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. ప్రతి జిల్లా పరిపాలనా యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉండాలి” అని అన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందని గుర్తు చేశారు.
వర్షాలతో పాటు ఈదురుగాలుల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున, విద్యుత్ శాఖ వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలో వర్షాల వలన డీసీఎం వ్యాన్, డ్రైవర్ వాగులో కొట్టుకుపోవడం దురదృష్టకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్లు, బ్రిడ్జిలు, లోలెవల్ కాజ్‌వేలు, కల్వర్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
వరద నీరు రహదారులపైకి చేరే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వాహనాలను ఆ మార్గాల్లోకి అనుమతించకుండా పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేయాలని ఆదేశించారు. స్థానిక సీఐలు, రెవిన్యూ అధికారులు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు తీసుకోవాలని, కుంభవృష్టి సమయంలో ప్రజలు అవసరం లేకుండా రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.
అదేవిధంగా, వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే వరంగల్ ప్రాంతానికి హైదరాబాద్ నుండి హైడ్రా టీంలు, సహాయక సామగ్రి వెంటనే పంపించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు.

