2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
• కోటి 15 లక్షల కుటుంబాలకు ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకం
• అల్పాహారంతో కూడిన ఉచిత బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌తో విద్యా రంగంలో సరికొత్త విప్లవం
• పేదల సొంతింటి కల నిజం చేస్తూ సాగుతున్న సంక్షేమ రథం – ‘ఇందిరమ్మ ఇళ్లు’
• ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన, జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన సాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థిక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు, ప్రణాళికలను డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా సవివరంగా ప్రకటించారు.
రాష్ట్ర ఆర్థిక వృద్ధిని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టేందుకు ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రస్తుతం 200 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు, ఆ తర్వాత 2047 నాటికి 3 ట్రిలియన్ యూఎస్ డాలర్ల బృహత్తర వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అంతర్జాతీయ నమూనాలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ‘క్యూర్, ప్యూర్, రేర్’ అనే మూడు విభాగాలుగా వర్గీకరించి, ప్రణాళికాబద్ధమైన వృద్ధికి శ్రీకారం చుట్టామని ఆయన ప్రకటించారు.

ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశంలోనూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం నూతన పథకానికి శ్రీకారం చుట్టిందని భట్టి తెలిపారు. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా అందించేలా “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం” తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన వేళ ఆ కుటుంబం ఆర్థిక విపత్తులో చిక్కుకోకుండా ఈ పథకం కొండంత అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలో ప్రజా ప్రభుత్వం ద్వారా అభయహస్తం కింద చేకూరిన లబ్ధిని మరియు ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని డిప్యూటీ సీఎం గణాంకాలతో వివరించారు. మొదటి విడత కింద మంజూరైన 16,243 ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, లబ్ధిదారుల ఖాతాల్లో రూ.441 కోట్లు జమ చేశామన్నారు. ఇప్పటికే 8,291 ఇళ్ల గృహప్రవేశాలు పూర్తి చేశామని, త్వరలోనే రెండో విడత కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను పారదర్శకంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 2,45,069 మంది లబ్ధిదారులకు రూ.41 కోట్ల సబ్సిడీ భరిస్తూ రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం ద్వారా జిల్లాలో రూ.303.55 కోట్ల పొదుపు సాధ్యమైందని చెప్పారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ కోసం 2,50,204 కుటుంబాలకు రూ.236.60 కోట్ల సబ్సిడీని భరించామని, కొత్తగా 59,448 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా మొత్తం 4,70,591 కార్డుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని వివరించారు.
రాబోయే విద్యా సంవత్సరం 2026-27 నుండి ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో కూడిన ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో ఏ చిన్నారి కూడా ఖాళీ కడుపుతో పాఠశాలకు వెళ్లకూడదనే లక్ష్యంతో ఈ పథకం తెచ్చామన్నారు.
ఖమ్మం జిల్లాలో 1,187 పాఠశాలల్లోని 61,065 మంది పిల్లలకు, 6,300 మంది ఇంటర్ విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందనుందన్నారు. జిల్లాలో ఒక్కొక్కటి రూ.200 కోట్ల వ్యయంతో 5 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు నిర్మిస్తున్నామని, పరిశ్రమల అవసరాల కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడమే కాకుండా విద్యార్థులకు నెలకు రూ.2,000 స్కాలర్‌షిప్ ఇస్తున్నామని తెలిపారు.
జిల్లాలో చేపట్టిన “ఎవ్రీ చైల్డ్ రీడ్స్” కార్యక్రమం ద్వారా విద్యార్థుల చదివే సామర్థ్యం 11 శాతం నుండి 85 శాతానికి పెరిగిందని, టెన్త్ ఫలితాల్లో 95 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించామని అభినందించారు. మరిన్ని ప్రగతి అంశాలను ప్రస్తావిస్తూ.. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన రంగంలో 20 వేల మెగావాట్ల ఉత్పత్తి, రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 కింద పని చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలోని 2,718 ప్రభుత్వ భవనాలపై 58 మెగావాట్ల సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైందని, గార్లపాడు గ్రామంలో వ్యవసాయ మోటార్లకు 7.5 కిలోవాట్ సోలార్ ప్లాంట్లను ప్రారంభించామని చెప్పారు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యానికి గానూ, మొదటి రెండున్నరేళ్లలోనే రూ.60,000 కోట్లు పంపిణీ పూర్తి చేశామన్నారు. ఖమ్మం జిల్లాలో 52,059 సంఘాలకు రూ.57.15 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేశామని, మధిరలో రూ.109 కోట్ల సబ్సిడీతో ఎస్సీ మహిళలకు ఇందిరా మహిళా డెయిరీ కింద పాడి గేదెల పంపిణీ చేపట్టామని వివరించారు.
వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతూ.. రైతు భరోసా కింద యాసంగిలో 3,43,997 మంది రైతులకు రూ.270.93 కోట్లు జమ చేశామన్నారు. సీతారామ ఎత్తిపోతల, జవహర్ ఎత్తిపోతల రూ.630 కోట్ల పనులను వేగవంతం చేసి సాగునీరు అందిస్తున్నామని, రూ.155 కోట్లతో ఖమ్మం మార్కెట్ యార్డును మోడల్ మార్కెట్‌గా మారుస్తున్నామని వెల్లడించారు. రైతుల భూమిపై హక్కుల కోసం “భూభారతి చట్టం” తెచ్చామన్నారు.
జిల్లావ్యాప్తంగా 427 కి.మీ. రహదారులను రూ.1,230 కోట్ల అంచనాతో అభివృద్ధి చేయనుండగా, మున్నేరు నదిపై రూ.180 కోట్లతో ప్రతిష్ఠాత్మక తీగల వంతెన నిర్మిస్తున్నామని, ఖమ్మం కార్పొరేషన్‌లో రూ.250 కోట్లతో, మధిరలో రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సాగుతున్నాయని చెప్పారు. జిల్లాలోని 915 గ్రామాల్లో 2.48 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందిస్తున్నామని, వేసవి నీటి ఎద్దడి నివారణకు రూ.21.30 కోట్ల పనులు మంజూరు చేశామని తెలిపారు.
వైద్య రంగంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 29,047 మందికి రూ.87.37 కోట్ల ఉచిత వైద్యం అందించామని, ఖమ్మం జీజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ భవనం తుది దశకు చేరిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.60 కోట్లకు పైగా విడుదల చేశామని, రజకులు, నాయిబ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.
ఖమ్మం ఖిల్లాపై రూ.29 కోట్లతో రోప్‌వే పనులు వేగంగా సాగుతున్నాయని, పాలేరు లేక్, నేలకొండపల్లి బౌద్ధ స్థూపం అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామన్నారు. టీజీ ఐపాస్ కింద రూ.436 కోట్ల పెట్టుబడితో 200 పారిశ్రామిక యూనిట్లకు అనుమతి ఇచ్చామని, జాబ్ మేళా ద్వారా 654 మంది యువతకు ఉపాధి కల్పించామని డిప్యూటీ సీఎం వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అహర్నిశలు శ్రమిస్తున్న ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్ సహా పౌర సమాజానికి, పోలీసులకు, అమరవీరుల కుటుంబాలకు మరియు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
