ఆధ్యాత్మిక నిలయంగా ఇంద్రకీలాద్రి…

ఆధ్యాత్మిక నిలయంగా ఇంద్రకీలాద్రి…

రూపురేఖలు మారుస్తున్న మాస్టర్ ప్లాన్..
అంతర్జాతీయ ఆధ్యాత్మిక గమ్యస్థానంగా అమ్మవారి ఆలయం
పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే దిశగా అడుగులు
భక్తులకు విరివిగా సౌకర్యాల విస్తరణ..
రెండవ ఘాట్ రోడ్, క్యూ కాంప్లెక్స్‌లతో రద్దీకి శాశ్వత పరిష్కారం
భక్తుల భద్రత, రక్షణ, సౌకర్యాలు విస్తరణ..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంను దేశవ్యాప్తంగా అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. భక్తులకు సౌకర్యాలు పెంపుతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోంది.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ ఇంజినీరింగ్ విభాగ అధికారులు, బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ రాక్ మెకానిక్స్, స్కూల్ అఫ్ ప్లానింగ్ అండ్ ఆర్చిటెక్చర్ విజయవాడ ప్రతినిధులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ పనులు వేగవంతం చేశారు.

ఆధ్యాత్మికతకు ఆధునిక రూపం..

ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధిలో అతి ముఖ్యమైన మాస్టర్ ప్లాన్‌లో భౌతిక సదుపాయాల విస్తరణ మాత్రమే కాకుండా, ప్రతి భక్తుడికి “దివ్య అనుభూతి” కలిగించేలా వాతావరణాన్ని రూపకల్పన చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది. కొండపై దర్శనం అనంతరం కింద ప్రవహించే కృష్ణా నది సౌందర్యాన్ని ఆస్వాదించేలా వ్యూ పాయింట్లు, ధ్యాన కేంద్రాల అభివృద్ధి ప్రతిపాదనలో కీలకంగా నిలుస్తోంది. ఇంద్రకీలాద్రి చరిత్రలో మైలురాయిగా నిలిచే ‘పాశుపాతాలయం’ నిర్మాణానికి అవసరమైన భూగర్భ సర్వేలను ఎన్ఐఆర్ఎఫ్ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా భక్తులకు ప్రాచీన ఆలయ వైభవాన్ని ఆధునిక సౌకర్యాలతో అనుభూతి చేసే అవకాశం కల్పించనున్నారు.

భక్తుల రద్దీకి శాశ్వత పరిష్కారం..

అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యలు, ఇరుకైన మార్గాలు ప్రధాన సవాలుగా మారాయి. దీనికి పరిష్కారంగా విశాలమైన క్యూ కాంప్లెక్స్‌లు, ఆధునిక పార్కింగ్ వసతులు, ముఖ్యంగా రెండవ ఘాట్ రోడ్ నిర్మాణంపై దృష్టి సారించారు. ఇది అమలులోకి వస్తే దర్శన వ్యవస్థ మరింత సాఫీగా మారే అవకాశం ఉంది. సి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న సుందరీకరణ పనులు, ఎస్ పి ఏ రూపొందించే డిజైన్‌లతో సమన్వయం చేసుకుంటూ ఇంద్రకీలాద్రిని విశ్వస్థాయి ఆధ్యాత్మిక కేంద్రముగా తీర్చిదిద్దాలని అధికారులు పనులు వేగవంతం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కట్టుదిట్టమైన నిర్ణయాల ఫలితంగానే ఎన్ ఐ ఆర్ ఎమ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములు అయ్యారు. కొండ చరియల భద్రత, భక్తుల రక్షణ, సౌకర్యాల విస్తరణ ఈ మూడు అంశాలపై రాజీ లేకుండా పనులు ముందుకు సాగుతున్నాయి.

త్వరలో తుది రూపు..

వచ్చే వారంలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో జరగనున్న సమావేశంలో మాస్టర్ ప్లాన్‌కు తుది రూపు ఇచ్చి పనులను వేగవంతం చేయనున్నారు. ఎన్ ఐ ఆర్ ఎం అందించే సాంకేతిక నివేదిక ఈ అభివృద్ధి పనులకు కీలకంగా మారనుంది. ఇంజినీరింగ్ అధికారులు, సాంకేతిక నిపుణుల సమిష్టి కృషితో ఇంద్రకీలాద్రి భక్తులకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన, ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైన క్షేత్రంగా రూపాంతరం చెందే దిశగా అడుగులు వేస్తోంది.

భక్తులకు మధురానుభూతి..

అమ్మవారి పాదాల చెంత భక్తుడికి కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఆ అనుభూతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మాస్టర్ ప్లాన్ అమలుతో ఇంద్రకీలాద్రి దేశంలోనే అత్యంత సురక్షితమైన, సుందరమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతుంది

Leave a Reply