Basara IIT | ఆహార నాణ్యతపై విద్యార్థుల ఆందోళన
Basara IIT | ఆహార నాణ్యతపై విద్యార్థుల ఆందోళన
- టిఫిన్‌లో బొద్దింక కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్
Basara IIT | బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో ఆదివారం ఉదయం విద్యార్థులకు అందించిన టిఫిన్‌లో బొద్దింక కనిపించిందనే ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాల ప్రకారం, యూనివర్సిటీ మెస్‌లో విద్యార్థులకు ఉదయం చపాతీ, ఆలూ కుర్మా వడ్డించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థికి అందించిన ఆలూ కుర్మాలో బొద్దింక కనిపించినట్లు ఆరోపించారు. దీంతో విద్యార్థి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు.

ఈ విషయం తెలిసిన ఇతర విద్యార్థులు కూడా మెస్‌లో అందిస్తున్న ఆహార నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెస్ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూనివర్సిటీ వర్గాలు స్పందించాయి. ఈ విషయమై యూనివర్సిటీ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించగా, ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు ఓ అధికారి తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
