TG | ఆదివాసుల అభివృద్ధి పున‌రంకింతం అయిన ప్ర‌జా ప్ర‌భుత్వం మాది : సీతక్క

ఆదిలాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో : జల్, జంగల్, జమీన్ నినాదంతో తమ ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధికి పాటుపడుతుందని, పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమపై ఉందని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ ( సీతక్క) అన్నారు. 44 ఏళ్ల కిందట ఇంద్రవెల్లి కాల్పుల్లో మృతి చెందిన గిరిజనులను స్మరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఆదివారం సంస్మరణ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద మంత్రి సీతక్క ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాల్పుల్లో మృతి చెందిన 15 కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ట్రైకార్ పథకం కింద ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేశారు.

పోడు భూములకు పట్టాలు కల్పిస్తాం.. సీతక్క

భూమి కోసం భుక్తి కోసం పోరాడిన ఆదివాసుల‌కు హక్కులతో పాటు వారి ఆశయాల సాధన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. సంస్మరణ సభలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి నుండే సమర శంఖం పూరించి అధికారంలోకి రావడం జరిగింది అన్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవడంతోపాటు మారుమూల గిరి గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. ఇంద్రవెల్లి సంస్కరణ సభకు గతంలో పాలకులు నిషేధజ్ఞలు విధించి కనీసం నివాళులు అర్పించకుండా అడ్డుకున్నారని అన్నారు. పలు గ్రామాలకు రోడ్ల విషయంలో కేంద్రంతో మాట్లాడి అనుమతులు సాధిస్తామని అన్నారు.

గిరిజనుల బతుకులు మార్చేది ఎప్పుడు..?అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని గిరిజన సంఘాల నేతలు అన్నారు. గిరిజన అమరవీరుల ఆశ‌యాలు సాధించాలంటే కుటుంబానికి 5 ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం, సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలకులు మారిన తమ బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అడవుల నుండి ఆదివాసులను వెలగొట్టేందుకు పాలక ప్రభుత్వాలు కుట్ర పన్ను తున్నాయని ఆరోపించారు. కనీసం చేనులో బోర్ వెయ్యాలన్న అటవీ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని, రోడ్ల సౌకర్యం లేక అనేక అవస్థలు పడుతున్నామని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు వెడమ బొజ్జు, ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ దండెవిటల్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, మాజీ ఎంపీ సోయంబాపు రావ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,ఆదివాసీ సంఘాల నేతలు జగ్గారావు, దుర్గ మేడి , కనకతు కారం, బొంత ఆశా రెడ్డి, ప్రభాకర్, ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *