తెలంగాణ ఆత్మగౌరవానికి గులాబీ జెండానే ప్రతీక

తెలంగాణ ఆత్మగౌరవానికి గులాబీ జెండానే ప్రతీక

-కడియం వెంకట్ రెడ్డి

గరిడేపల్లి (సూర్యాపేట), ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి గులాబీ జెండా నిలువుటద్దమని హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు కడియం వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన గరిడేపల్లిలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఆయన ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసిన అనంతరం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, అలుపెరగని ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. గత పదేళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధించిందని, సాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు.

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజలు త్వరలోనే వాస్తవాలను గ్రహిస్తారని, రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పతాని సైదులు, పెండెం శోభారాణి ధనయ్య, మాజీ ఎంపీటీసీ స్వప్న వెంకట్ రెడ్డి, మన్సూర్ అలీ, సైదాబీ రాజమహమ్మద్, మోదాల అంజయ్య, అంకమ్మ కాశి, పెండెం వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply