మంత్రి సహకారంతో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మంత్రి సహకారంతో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
- మీన్‌పూర్ సర్పంచ్ టప్ప నాగేష్
ఊట్కూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో మండలంలోని అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని అమీన్‌పూర్ సర్పంచ్ టప్ప నాగేష్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అమీన్‌పూర్‌లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగులు పంపిణీ చేసి, గృహ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. గూడు లేక ఇబ్బంది పడుతున్న పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం నెరవేరుస్తోందని పేర్కొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో అమీన్‌పూర్ గ్రామానికి 26 ఇళ్లు మంజూరయ్యాయని, ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమన్వయంతో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, దశలవారీగా బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శేఖర్ రెడ్డి ఇతర గ్రామ ప్రముఖులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
