గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలి

గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలి
- తహసిల్దార్‌కు వినతిపత్రం
ఊట్కూర్, ఆంధ్రప్రభ: గోమాత ఆరాధనా దినోత్సవం పురస్కరించుకొని, సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ‘గోమాత ఆరాధన ఉద్యమం’ ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసిల్దార్ చింత రవికి గోప్రేమికులు వినతిపత్రం సమర్పించారు.
దేశవ్యాప్తంగా తహసిల్దార్, మండల. జిల్లా స్థాయి అధికారుల ద్వారా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ , ముఖ్యమంత్రులకు వినతిపత్రాలు అందజేయాలనే పిలుపు మేరకు, ఊట్కూర్‌లో గోప్రేమికులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్థానికంగా సంతకాల సేకరణ చేపట్టి, ఆ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ… భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో గోమాతకు అత్యంత విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు. “గోమాతకు గౌరవం – దేశానికి అభివృద్ధి” మరియు “గోసేవే మహాసేవ, గోరక్షణే దేశ రక్షణ” అంటూ నినాదాలు చేస్తూ గోరక్షణపై అవగాహన కల్పించారు. గోమాత పరిరక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా కోరారు. ఈ కార్యక్రమంలో గోప్రేమికులు, సామాజిక కార్యకర్తలు రాములు, వెంకట్ నారాయణ, భీమ్ రాజు తదితరులు పాల్గొన్నారు
