గ్రామీణ ఉపాధికి వరంగా మారిన పథకం…

ఊట్కూర్, ఆంధ్రప్రభ: రైతులు, కూలీలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్ సూచించారు.
శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్ర శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, రైతులు, కూలీలకు ఉపాధి హామీ పథకం వరం లాంటిదని అన్నారు. వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కూలీలు ఉదయం 6 గంటలకే పనులకు హాజరు కావాలని సూచించారు.
కూలీలు కలిసికట్టుగా పనులు నిర్వహిస్తే కొలతల ప్రకారం గిట్టుబాటు కూలి అందుతుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ పొలాల్లో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేసుకోవాలని సూచించారు.
మండలంలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో చలువ పందిర్లు, ఓఆర్‌ఎస్ పాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు.
అలాగే ఉపాధి హామీ సిబ్బంది కూలీల హాజరును సకాలంలో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీవో లక్ష్మీరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ శివకుమార్, సీనియర్ మేట్ భీమ్‌శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
