Telangana | శాసనమండలిలో ఘనంగా కార్యక్రమం

Telangana | శాసనమండలిలో ఘనంగా కార్యక్రమం

Telangana | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామంగా మంత్రి అజారుద్దీన్‌, ప్రొఫెసర్‌ కోదండరాం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్‌ కోటాలో ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల మేరకు ఇవాళ శాసనమండలిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. మంత్రి అజారుద్దీన్‌ ఇప్పటికే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడం ద్వారా ఆయనకు శాసనపరమైన పూర్తి అర్హత లభించింది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్‌ కోదండరాం శాసనమండలిలోకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రొఫెసర్‌ కోదండరాం సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన శాసనమండలిలో సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా ప్రజా సమస్యలపై మరింత బలమైన స్వరం వినిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.