బైక్ లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యానికి యత్నం

బైక్ లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యానికి యత్నం

-అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

-దొంగిలించిన బైక్ పై వచ్చి ఘాతుకం

చిట్యాల, ఆంధ్రప్రభ: బైక్ లిఫ్ట్ ఇచ్చే నెపంతో మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడిన కిరాతకుడిని భూపాలపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన మోటార్ సైకిల్, బాధితురాలి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఘటన వివరాలను చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ గురువారం సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషీనగర్ జిల్లాకు చెందిన అమర్జిత్ సింగ్ (33) వరికోత యంత్ర డ్రైవర్ గా పనిచేస్తూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తుంటాడు.

ఈ నెల 18న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మద్యం సేవించిన నిందితుడు, అక్కడ నిలిపి ఉంచిన ఒక బైక్ను దొంగిలించి భూపాలపల్లి జిల్లా వైపు బయలుదేరాడు. అదే రోజు రాత్రి 7:30 గంటల సమయంలో భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట సెంటర్ వద్ద ఓ మహిళ లిఫ్ట్ కోసం ఎదురుచూస్తుండగా, ఆమెను తన బండిపై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఆరేపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో బైక్ ఆపి, ఆమెను పొదల్లోకి ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా, బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో ఆమె బ్యాగ్ను లాక్కుని పరారయ్యాడు.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, డీఎస్పీ సంపత్ రావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం చిట్యాల పరిధిలోని కైలాపూర్ సబ్ స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, పారిపోవడానికి ప్రయత్నించిన అమర్జిత్ సింగ్ ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన టేకుమట్ల ఎస్ఐ అమూల్య, సిబ్బంది మహేందర్, వెంకటేష్ రామకృష్ణలను జిల్లా ఎస్పీ అభినందించారు. “మహిళా భద్రత మా ప్రథమ ప్రాధాన్యం. అపరిచిత వ్యక్తులను నమ్మి వాహనాలు ఎక్కవద్దు. ప్రయాణాల్లో సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఉక్కుపాదం మోపుతాం.” అని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు.

Leave a Reply