ఎడతెరిపి వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు
పర్యవేక్షిస్తున్న మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సుల్తానాబాద్ (ఆంధ్రప్రభ): మండలంలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలు కొనసాగుతుండటంతో పలుచోట్ల కాలనీల్లో నీరు నిలిచింది. మరోవైపు ఇప్పటికే నాట్లు వేసిన రైతులు ఈ వర్షాలతో పంటలకు మేలు జరుగుతుందని, భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వర్ష పరిస్థితులను మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ స్వయంగా పర్యవేక్షిస్తూ పలు వార్డుల్లో పర్యటించారు. నిల్వ నీటిని వెంటనే తొలగించేలా మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత తన వార్డులో జేసీబీ సహాయంతో కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి రోడ్లపై నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టారు. వార్డు కౌన్సిలర్లు కూడా తమ తమ వార్డుల్లో డ్రైనేజీలను శుభ్రం చేయించి నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మున్సిపల్ కమిషనర్ టి. రమేష్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
