దళారుల దందాను అరికట్టలేని అధికారులు

దళారుల దందాను అరికట్టలేని అధికారులు

  • సిపిఐ మండల నాయకులు మంద భాస్కర్

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం వ్యవసాయ మార్కెట్ సమీపంలో జరుగుతున్న దళారుల దందాను మార్కెట్ అధికారులు అరికట్టలేక పోతున్నారని సిపిఐ మండల నాయకులు మంద భాస్కర్ విమర్శించారు. సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ దన్నసరి సొసైటీ ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా మార్కెట్ తో పాటు వివిధ గ్రామాలలో మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారన్నారు. కాంటాలు పెట్టిన బస్తాలను రవాణా చేసేందుకు లారీలు లేక, గన్ని సంచుల కొరత వల్ల రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపుల పడాల్సి వస్తుందన్నారు.

రైతులు పండించిన పంటను విక్రయించేందుకు తీసుకు వస్తున్న సమయంలో కొంతమంది దళారులు మార్కెట్కు వెళితే ఆలస్యంతో పాటు రోజుల తరబడి పడిగాపుల పడాల్సి వస్తుందని మాయమాటలు చెప్పి రైతుల సరుకులను మార్కెట్ బయటనే కొనుగోలు చేసి జీరో దందా నిర్వహిస్తున్నారన్నారు. దీనివల్ల మార్కెట్ ఆదాయానికి గండిపడడమే కాకుండా, తేమ సాకు చూపుతూ ధర తగ్గిస్తూ, వే బ్రిడ్జిల వద్ద తూకం వేసి మిల్లులకు, ట్రేడింగ్ కంపెనీలు తీసుకొని వచ్చిన ట్రాక్టర్ల నుంచి 30 కేజీల మక్కలను తరుగు పేరుతో కోత విధిస్తూ దోపిడి చేస్తున్నారని పేర్కొన్నారు.

అదేవిధంగా నగతు డబ్బులు కావాలంటే ఒక్క శాతం డబ్బులను కట్ చేస్తూ, లేకపోతే వాయిదా పద్ధతిలో చెక్కులను ఇస్తూ బ్యాంకుల చుట్టూ రైతులను ప్రదక్షణాలు చేయిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత తతంగం జరుగుతున్న మార్కెట్ అధికారులు కళ్ళున్న కబోది లాగా వ్యవహరించడం సిగ్గుచేటనీ , ఈ విషయం పై మార్కెట్ అధికారులు చర్యలు తీసుకుపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ దందా అంతా మార్కెట్ అధికారుల కనుసన్నాలలో జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు. తక్షణమే మార్కెట్ అధికారులు చొరవ చూపి జీరో దందాను అరికట్టి, రైతులను మోసం చేసే దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply