ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
దండేపల్లి, ఆంధ్రప్రభ:
వరి ధాన్యం కొనుగోలు, రవాణా, నిల్వ ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం దండేపల్లి మండలంలో పర్యటించి ధాన్యం ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియలను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మండలంలోని కన్నెపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్, రాధాకృష్ణ రైస్ మిల్ గోదాములను సందర్శించి లారీల ద్వారా తీసుకొచ్చిన ధాన్యం దిగుమతి పనులను పరిశీలించారు. ధాన్యం నిల్వ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులు, రైస్ మిల్ నిర్వాహకులకు సూచించారు.
అనంతరం దండేపల్లి మండల కేంద్రంలో ఆర్‌సెటి (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్) ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు నిర్వహిస్తున్న మగ్గం వర్క్ శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమాల్లో లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, తహసిల్దార్ రోహిత్ దేశ్పాండే మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాగర్లమూడి ప్రసాద్, డీపీఎం, ఏపీఎం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
