ఏపీకే ఫైల్‌తో లక్ష రూపాయల సైబర్ మోసం

ఏపీకే ఫైల్‌తో లక్ష రూపాయల సైబర్ మోసం

  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఖానాపురం హవేలి సీఐ భానుప్రకాష్

ఖమ్మం, ఆంధ్రప్రభ: ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేయడంతో సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు నుంచి సుమారు లక్ష రూపాయలకు పైగా నగదు మాయం చేసిన ఘటన ఖమ్మం బాలాజీనగర్‌లో వెలుగుచూసింది.

ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చిన ఏపీకే ఫైల్‌ను ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వ్యక్తమైంది. అనంతరం క్రెడిట్ కార్డు ద్వారా అనధికార లావాదేవీలు జరగడంతో పాటు బ్యాంకు ఖాతా నుంచి కూడా డబ్బులు మాయం అయినట్లు గుర్తించారు.

బాధితుడు వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి లావాదేవీలు నిలిపివేయాలని కోరడంతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్‌లో పూర్తి వివరాలు అందజేశాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐటీ యాక్ట్ 66Dతో పాటు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సైబర్ నేరానికి ఉపయోగించిన మొబైల్ నంబర్లు, బ్యాంకు లావాదేవీల వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఖానాపురం హవేలి సీఐ భానుప్రకాష్ మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు.

పెట్టుబడుల పేరుతో మోసాలు పెరుగుతున్నాయని, అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి సైబర్ నేరగాళ్లు అమాయకుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఆయన తెలిపారు. అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెరిగితేనే సైబర్ నేరాలను సమర్థంగా అరికట్టవచ్చని సీఐ భానుప్రకాష్ పేర్కొన్నారు.

Leave a Reply