వీధికుక్కల దాడి.. మహిళ మృతి
స్పందించాలని అధికారులను కోరుతున్న గ్రామస్తులు
కొత్తగూడెం, ఆంధ్రప్రభ : కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామంలో వీధికుక్కల బెడద ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన మారే రాములమ్మ అనే మహిళ సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్లే సమయంలో వీధికుక్కల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుక్కలు వెంబడిస్తూ తీవ్రంగా కరివడంతో మహిళ గాయపడగా, ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కలను తరిమికొట్టి రక్షించారు. అనంతరం గాయపడిన మహిళను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గ్రామంలో గత కొంతకాలంగా వీధికుక్కల సంచారం అధికమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పొలాలకు వెళ్లే రైతులు, మహిళలు, పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి కుక్కలు దాడి చేస్తాయోనన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో తిరుగుతున్న వీధికుక్కలను పట్టుకునే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కుక్కలు ఆ మహిళా దుస్తులు పూర్తిగా చింపివేయడం కాకుండా తలను కూడా ఛిద్రం చేసాయి. స్థానికులు ఒక చీర తీసుకువచ్చి ఆమెకు కప్పి చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అయితే చికిత్స పొందుతూ చనిపోయింది.
