పరిశ్రమలకు చట్టపరమైన అనుమతులు విధిగా ఉండాలి

పరిశ్రమలకు చట్టపరమైన అనుమతులు విధిగా ఉండాలి
- కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటిరెడ్డి
మేడ్చల్, ఆంధ్రప్రభ:
పరిశ్రమల యాజమాన్యాలు విధిగా చట్టపరమైన అనుమతులు పొంది ఉండటంతో పాటు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటిరెడ్డి సూచించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌కు చెందిన శుభం ప్రెస్టేజ్ హోటల్‌లో పరిశ్రమల యజమానులతో బుధవారం ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఫ్యాక్టరీల నిర్వహణలో యాజమాన్యాలు తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాలు, పాటించాల్సిన నిబంధనలను సుదీర్ఘంగా వివరించారు.
కెమికల్ కంపెనీలలో నిప్పురవ్వలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాసెస్ ఏరియాలో స్మోకింగ్, వెల్డింగ్, మొబైల్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని డీసీపీ స్పష్టం చేశారు. అగ్నిమాపక యంత్రాలను, డీసీపీ, CO2 రకాల సిలిండర్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని, ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఫైర్ డ్రిల్ నిర్వహించాలని కోరారు. అన్ని రకాల రసాయనాలకు సంబంధించిన సేఫ్టీ డేటా షీట్లను స్పష్టంగా డిస్ప్లే చేయాలన్నారు. వేర్వేరు రసాయనాలను విడివిడిగా ‘డైక్ వాల్స్’ నిర్మించి నిల్వ చేయాలని, రసాయనాలు ఉన్న ప్రతి డ్రమ్ముపై ప్రమాద సూచిక గుర్తులను ఉంచాలని సూచించారు.
పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ప్రాణాలకు యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాలని డీసీపీ స్పష్టం చేశారు. కార్మికులకు గూగుల్స్, గ్లోవ్స్, మాస్కులు వంటి రక్షణ పరికరాలను తప్పనిసరిగా అందించాలని పేర్కొన్నారు. నెలకొకసారి అగ్ని, రసాయన ప్రమాదాలపై కార్మికులకు అవగాహన శిక్షణ ఇవ్వాలని, సంవత్సరానికి ఒకసారి కార్మికులకు మెడికల్ టెస్టులు నిర్వహించాలని తెలిపారు. హార్ట్ వర్క్, ట్యాంక్ క్లీనింగ్ లాంటి పనులకు పర్మిట్ తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
కంపెనీలలో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికుల పట్ల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. వారి పూర్తి డేటాను కంపెనీల వద్ద భద్రపరుచుకోవడంతో పాటు నిఘా ఉంచాలని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కంపెనీల వద్ద విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం పరిశ్రమలకు లైసెన్స్ ఉండాలని, నిబంధనల మేరకు సేఫ్టీ ఆఫీసర్‌ను నియమించుకోవాలని డీసీపీ తెలిపారు. మండే స్వభావం గల ద్రవాలకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలన్నారు. వీటితో పాటు అగ్నిమాపక శాఖ నుండి ఫైర్ NOC, కాలుష్య నియంత్రణ మండలి నుండి పీసీబీ అనుమతులు విధిగా పొందాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, మేడ్చల్ సీఐ సత్యనారాయణ, ట్రాఫిక్ ఏసీపి వై వెంకటేశ్వరరావు, ఫైర్ ఆఫీసర్ ధనుంజయ్ రెడ్డి, ట్రాఫిక్ మేడ్చల్ సీఐ మధుసూదన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చందర్, జీహెచ్‌ఎంసీ అధికారి రామచందర్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పరిశ్రమల యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
