పంటల సాగు మెలకువలపై రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

పంటల సాగు మెలకువలపై రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

ఊట్కూర్, ఆంధ్రప్రభ:

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం, కొల్లూరు రైతు వేదిక భవనాల్లో బుధవారం నిర్వహించారు. కార్యక్రమాలకు సర్పంచ్ లు వాకిటి వెంకటేష్, తిరుమలేష్, సింగారం సువర్ణమ్మ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్లు భాను, శైలు మాట్లాడుతూ ప్రధానంగా యూరియా వాడకాన్ని తగ్గించి, జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

తద్వారా సాగు ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా, నేల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని సూచించారు. అధిక రసాయనాల వాడకం వల్ల నేలకు, పంటకు మనుషులకు కలిగే నష్టాలను వివరించారు. పంట మార్పిడి యొక్క ప్రాధాన్యతను, అధిక దిగుబడినిచ్చే విశ్వవిద్యాలయ ప్రముఖ వరి వంగడాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. నీటి పొదుపు పద్ధతులు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డి, ఏ ఈ ఓ లు నందిని, స్వప్న, ఆదర్శ రైతులు తదితరులు పాల్గొన్నారు.