108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డా క్షేమం!
108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డా క్షేమం!
మునుగోడు, ఆంధ్రప్రభ:
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాలోకి వెళితే.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గుండ్లోరిగూడెం గ్రామానికి చెందిన జంగిలి విజయలక్ష్మికి అర్ధరాత్రి సమయంలో పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
మునుగోడు 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి గుంటి రమేష్, పైలట్ ఎస్.కె మునీర్ సకాలంలో అక్కడికి చేరుకొని ప్రథమ చికిత్స చేస్తూ నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు తీవ్రం కావడం వల్ల అంబులెన్స్‌లోనే ప్రసవం చేయడంతో మగ బిడ్డ జన్మించింది. అనంతరం తల్లి, బిడ్డను నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో అంబులెన్స్‌లో ప్రసవం చేసిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి వైద్య సిబ్బంది 108 సిబ్బందిని అభినందించారు.
