సమన్వయంతో పనిచేసి అభివృద్ధి సాధించాలి: ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

వాజేడు, ఆంధ్రప్రభ: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని శాఖల వారీగా పనితీరును సమీక్షించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి సేవలందించాలని, ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణంపై అవగాహన కల్పించి నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని, మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి లబ్ధిదారులకు నిధులు సకాలంలో అందించాలని సూచించారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.

అనంతరం మండలంలోని చిక్కుపల్లి–పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్య జాతీయ రహదారి–163పై నిర్మిస్తున్న ఇసుకవాగు వంతెన పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. తాత్కాలిక అప్రోచ్ రోడ్డును తనిఖీ చేసి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృపాకర్, ఎమ్మార్వో శ్రీనివాస్, ఏవో వజీద్, ఎంఈవో వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు కాకర్లపూడి విక్రాంత్, చెన్నం ఎల్లయ్య, పల్లటి పుష్పలత, భరత్ తదితరులు పాల్గొన్నారు.