రైతులకు అడుగడుగునా ఇబ్బందులే
రైతులకు అడుగడుగునా ఇబ్బందులే
- కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
మోతె, ఆంధ్రప్రభ:
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతుభరోసా, సాగునీరు, ఉచిత కరెంటుతో పాటు చివరికి పండించిన పంట అమ్ముకునే దాకా అడుగడుగునా తీవ్ర ఇబ్బందులే ఎదురవుతున్నాయని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం మోతె మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నెల రోజులైనా వడ్లు కొనడం లేదని, తరుగు పేరుతో తమను దారుణంగా దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోళ్లలో ఏనాడూ ఇటువంటి దారుణ పరిస్థితులు లేవని గుర్తుచేశారు.
జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏసీ రూముల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెడుతూ వడ్లు బాగా కొంటున్నామని గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి అయిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దత్తత తీసుకున్న మోతె మండల కేంద్రంలోనే రైతులు 44 డిగ్రీల తీవ్ర ఎండలో నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాయిశ్చర్ చూడటానికి పది రోజులు, సంచులు ఇవ్వడానికి వారం, కాంటా పెట్టడానికి మరో వారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా మిల్లుకు వెళ్లాక తాలు సాకుతో లారీకి 4 నుండి 5 బస్తాల వరకు కోత పెడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి బస్తాకు 2-3 కిలోల తరుగు తీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
రైతుబంధు, యూరియా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు అన్నీ ఎగ్గొట్టినందుకు ఈ రైతు భరోసా వారోత్సవాల సంబరాలు చేస్తున్నారా అని నిలదీశారు. గత బీఆర్ఎస్ హయాంలో తాము 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ప్రస్తుత ప్రభుత్వానికి చేతకాక అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. వాతావరణ శాఖ అకాల వర్షాలు, తుఫాను హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో పంట నీట మునిగిపోతుందని రైతులు భయపడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని మార్కెట్లకు సరిపడా లారీలు, గన్నీ బ్యాగులు పంపి యుద్ధప్రాతిపదికన వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోతె మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు యాదవ్, ఆరే లింగారెడ్డి, జిల్లపల్లి ముత్తయ్య పాల్గొన్నారు. వీరితో పాటు మిక్కిలినేని సతీష్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి, పగడాల వెంకట్ రెడ్డి, ఇండ్ల వెంకటేశం, పల్స మల్సూర్, సర్పంచులు కోడి లింగయ్య, కుక్క బిక్షం, సుప్రజా, శ్రీను, మూడు నగేష్, వెంకన్న, గాంధీ, పాషా తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
