కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్ ఔషధ విక్రయాల విధానాలపై నిరసన

కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్ ఔషధ విక్రయాల విధానాలపై నిరసన

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
ఆన్‌లైన్ ఔషధ విక్రయాలకు (ఈ-ఫార్మసీ) వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టనున్న మెడికల్ షాపుల బంద్‌ను విజయవంతం చేయాలని చౌటుప్పల్ మండల కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సభ్యుల అత్యవసర సమావేశంలో బంద్ నిర్వహణపై ఏకగ్రీవంగా తీర్మానించారు.

అనంతరం ఈ బంద్ పిలుపునకు సంబంధించిన సమాచారాన్ని, దేశవ్యాప్త నిరసన వివరాలను చౌటుప్పల్ ఆర్‌డీఓ శేఖర్ రెడ్డిని కలిసి వినతి పత్రం (మెమొరాండం) ద్వారా అందజేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని పణంగా పెడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీ విధానాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆన్‌లైన్ మందుల సరఫరా వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండల వ్యాప్తంగా చేపట్టే ఈ నిరసన కార్యక్రమానికి ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించి బంద్‌ను వంద శాతం జయప్రదం చేయాలని చౌటుప్పల్ మండల కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

Leave a Reply