మునుగోడు ప్రగతి పథంలో.. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

మునుగోడు ప్రగతి పథంలో.. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
- కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ రాజు గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జ్ పబ్బు రాజు గౌడ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలకుల నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను, ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి బాట పట్టిస్తోందని స్పష్టం చేశారు.
ఆరు గ్యారంటీలతో ప్రజల్లో ఆనందం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా రంజక పాలన అందిస్తోందని పబ్బు రాజు గౌడ్ కొనియాడారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తూ పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించామన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ పేదల ఇళ్లల్లో వెలుగులు నింపిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం కోసం రుణమాఫీతో పాటు, ప్రజాపాలన ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని పబ్బు రాజు గౌడ్ కొనియాడారు. గతంలో మునుగోడు నియోజకవర్గానికి జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని వివరించారు.
”ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు తీసుకురావడమే కాకుండా తన సొంత నిధులను కూడా వెచ్చించి మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణ, విద్యుత్ సమస్య పరిష్కారం వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చడమే ఆయన లక్ష్యంగా పనిచేస్తున్నారు. గ్రామాలే ప్రగతికి పట్టుగొమ్మలు..గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి, పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నట్లు రాజు గౌడ్ తెలిపారు.
నియోజకవర్గంలోని రైతాంగానికి సాగునీరు అందించే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రులతో, అధికారులతో నిరంతరం సమీక్షలు జరుపుతున్నారని పేర్కొన్నారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని పబ్బు రాజు గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
