ఈ నెల 28న పల్స్ పోలియో.. విజయవంతం చేయండి

  • 0-5 ఏళ్ల లోపు చిన్నారులకు చుక్కల మందు వేయించాలి
  • చౌటుప్పల్ మండలంలో 52 కేంద్రాల ఏర్పాటు
  • వైద్యాధికారి డాక్టర్ కాటం రాజు

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ (ఆదివారం) నిర్వహించ తలపెట్టిన ‘పల్స్ పోలియో’ కార్యక్రమాన్ని మండలంలో వంద శాతం విజయవంతం చేయాలని చౌటుప్పల్ మండల వైద్యాధికారి డాక్టర్ సి.హెచ్. కాటం రాజు పిలుపునిచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పోలియో రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. ​మండల వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులు 5,959 మంది ఉన్నట్లు గుర్తించామని, వారందరికీ ఆదివారం తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం మండల పరిధిలో మొత్తం 52 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

​మిగిలిపోయిన వారికి ఇంటింటికీ వచ్చి…

“ఆదివారం ఏదైనా కారణం చేత పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారుల కోసం సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది నేరుగా ఇంటింటికీ వచ్చి చుక్కల మందు వేస్తారు.”

​అందరూ భాగస్వాములు కావాలి..

ఈ పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, పాత్రికేయులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని డాక్టర్ కాటం రాజు కోరారు. అందరూ సమన్వయంతో పనిచేసి మండలంలో 100% పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.