ఆర్థిక సంక్షోభంలో చేనేత సహకార సంఘాలు

ఆర్థిక సంక్షోభంలో చేనేత సహకార సంఘాలు

డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని, టెస్కో అనుసరిస్తున్న విధానాల వల్ల చేనేత కార్మికులు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని నేలపట్ల చేనేత సహకార సంఘం అధ్యక్షులు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమరి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని టెస్కో కార్యాలయంలో నిర్వహించిన ‘చేనేత సహకార సంఘాల ప్రోక్యూర్‌మెంట్ సమావేశం’లో ఆయన మాట్లాడారు. ​ఏడాది కాలంగా పెండింగ్‌లో బిల్లులు ​సహకార సంఘాల నుండి సేకరించిన వస్త్రాలను విక్రయించిన తర్వాత కూడా టెస్కో యాజమాన్యం బిల్లులను సకాలంలో చెల్లించడం లేదని శ్రీనివాస్ విమర్శించారు. సాధారణంగా బిల్లులు క్లియర్ కావడానికి ఆరు నెలల సమయం పడుతుండగా, హెచ్‌డీసీ ద్వారా నూలు కొనుగోలు చేసి వస్త్రాలు తయారు చేసిన సందర్భాల్లో మాత్రం పేమెంట్లు రావడానికి ఏడాది కాలం పడుతోందని ఆయన వివరించారు.

​లాభాల కంటే వడ్డీలే ఎక్కువ..
​సకాలంలో చెల్లింపులు రాకపోవడంతో సహకార సంఘాలు నిర్వహణ కోసం బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ​”వస్త్రాల విక్రయం ద్వారా వచ్చే లాభాల కంటే, బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు చెల్లిస్తున్న వడ్డీలే రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. ఇది సహకార సంఘాలను క్రమంగా నిర్వీర్యం చేస్తోంది ” అని ఆయన నిలదీశారు. ​ఎన్‌హెచ్‌టీసీ ద్వారా క్రెడిట్ సౌకర్యం కల్పించాలని,
ఈ సంక్షోభం నుండి చేనేత రంగాన్ని గట్టెక్కించడానికి ఎన్‌హెచ్‌టీసీ ద్వారా టెస్కోకు అవసరమైన యార్న్, సిల్క్‌ను ‘క్రెడిట్’ పద్ధతిలో అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల సంఘాలపై ఆర్థిక భారం తగ్గి, కార్మికులకు కొంత ఊరట లభిస్తుందని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ​ఈ సమావేశంలో యాదాద్రి జిల్లా గౌరవ అధ్యక్షులు భారత వాసుదేవ్, అసోసియేషన్ అధ్యక్షులు రామేశ్వరం, కందగట్ల భిక్షపతి, కోయలగూడెం సంఘం అధ్యక్షులు గడ్డం జయశంకర్, పోచంపల్లి డైరెక్టర్లు సూరపెళ్లి శ్రీనివాస్, గంజి అంజయ్య, నారాయణపురం సొసైటీ ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంఘాల అధ్యక్షులు, మేనేజర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply