రహదారి విస్తరణ బాధితులు ఆందోళన చెందవద్దు

రహదారి విస్తరణ బాధితులు ఆందోళన చెందవద్దు

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

చెన్నూర్, ఆంధ్రప్రభ: చెన్నూర్ పట్టణ మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన రహదారి విస్తరణ పనుల పట్ల బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నిబంధనల ప్రకారం 55 అడుగుల విస్తీర్ణంతో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

రహదారి విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. నష్టపోయిన దుకాణదారులకు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించే కమర్షియల్ కాంప్లెక్స్‌లో కేటాయింపుల సమయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు.

ఇతర ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు, మున్సిపల్ నోటీసులో సూచించిన ధ్రువపత్రాలను సమర్పిస్తే.. రాష్ట్రంలో ఎక్కడైనా ఉపయోగించుకునేలా టి.డి.ఆర్ (Transferable Development Rights) సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. దశల వారీగా సాగుతున్న ఈ విస్తరణ పనుల వల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా, అత్యవసర సేవలు (ఆంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు) సులభంగా చేరుకోవడానికి వీలవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

పనులు చేపట్టే ముందు సంబంధిత అధికారులు ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని, పారదర్శకంగా పనులు నిర్వహించాలని ఆదేశించారు. పట్టణ అభివృద్ధిని కాంక్షించి ప్రజలు, వ్యాపారస్తులు అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.

Leave a Reply