విద్యార్థులు వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

దండేపల్లి, ఆంధ్రప్రభ : ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 15 రోజులపాటు దండేపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించే సమ్మర్ క్యాంపులను 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి మంత్రి రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని చదువుకే పరిమితం కాకుండా వివిధ కార్యక్రమాల్లో రాణించేలా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యతో పాటు కళలు, క్రీడలు, సృజనాత్మకత, జీవన నైపుణ్యాలపై కూడా ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ క్యాంపు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో విభిన్న అంశాలపై శిక్షకులు శిక్షణ ఇవ్వనున్నారని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి దండేపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంఘర్స్ రాజేశ్వరరావును సంప్రదించాలని కోరారు.