కామారెడ్డిలో ఘోర అగ్ని ప్రమాదం
కామారెడ్డిలో ఘోర అగ్ని ప్రమాదం
18 షాపులు దగ్ధం
అర్ధరాత్రి ఘటనతో నష్టం
కామారెడ్డి ప్రతినిధి, : జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇందిరాచౌక్ వద్ద గల సుమారు 18 పూలు, పండ్ల దుకాణాలు, హోటళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రోజు మాదిరిగానే శనివారం రాత్రి చిరు వ్యాపారులు తమ దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే అర్ధరాత్రి 1 గంట తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు ఒక్కసారిగా భారీ ఎత్తున చెలరేగడంతో 18 షాపులకు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. వేసవి కాలం కావడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి ఒకదాని తర్వాత మరొక షాపులకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే షాపుల పక్కన చెత్తకుప్పకు నిప్పంటుకుని పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కు మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు షార్ట్ సర్క్యూట్ ఏదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందించేలా చూస్తామని ధైర్యం చెప్పారు. ఇందిరా చౌక్ వద్ద గత కొన్నేళ్లుగా చిరు వ్యాపారులు పూల దుకాణాలు, చిన్నపాటి హోటల్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పూల ఆర్డర్ల కోసం పువ్వులు స్టాక్ తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. జీవనోపాధి కోల్పోవడంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
