గోదావరి కరకట్ట భద్రత కోసం..

గోదావరి కరకట్ట భద్రత కోసం..


ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నది కరకట్ట భద్రత కోసం నూతన సాంకేతికతతో చేపడుతున్న జియో ట్యూబ్స్ ఏర్పాటు పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గురువారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా గోదావరి నది ప్రవాహ పరిస్థితులు, కరకట్ట భద్రత, వరదల సమయంలో నది తీరానికి నష్టం జరగకుండా చేపడుతున్న రక్షణ చర్యలను పరిశీలించారు. సంబంధిత అధికారులను అడిగి మ్యాప్ ఆధారంగా గోదావరి ప్రవాహ తీరు, కరకట్ట పరిస్థితులు, జియో ట్యూబ్స్ ఏర్పాటు విధానం, అమలు చేస్తున్న రక్షణ చర్యల పై పూర్తి వివరాలను తెలుసుకున్నారు.

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.