సమాజశ్రేస్సుకు మీడియా పాత్ర మరువలేనిది..
సమాజశ్రేస్సుకు మీడియా పాత్ర మరువలేనిది..
వెస్ట్ జోన్ ఏ.సి.పి దుర్గారావు..
జన చైతన్యం మరింత అభివృద్ధి కావాలి వెల్లడి..
ఘనంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు..
చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గం వించిపేట లో ఉన్న శ్రీ విద్యాంజలి హైస్కూల్లో ఆదివారం ఉదయం శ్రీ చైతన్య డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో ప్రపంచ పత్రికా స్వేచ్చ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెస్ట్ జోన్ ఏ.సి.పి ఎన్.డి.వి దుర్గారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా పని చేయడంలో మీడియా రంగం కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.
గత పదేళ్లుగా వెస్ట్ జోన్ లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో మీడియా మిత్రుల సహకారం మరువలేనిదన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో మంచి తో అంతే వేగంగా చెడు కూడా ప్రయాణిస్తుంది అని అన్నారు. తప్పుడు వార్తలు కాకుండా నిజాలను నిర్భయంగా ప్రచురించాలని ఆయన కోరారు. జన చైతన్యం వ్యవస్థాపకులు పల్లేటి ఆనంద్ విరాట్ మాట్లాడుతు మరుగున పడిపోతున్న జర్నలిజం విలువలను తిరిగి కాపాడేందుకు సరికొత్త ప్రయత్నంగా జన చైతన్యం నాంది పలకనుందన్నారు. అవినీతిలో కురుకుపోయిన వ్యవస్థల్లో సైతం మార్పు తీసుకువచ్చినప్పుడే నిజమైన జర్నలిజం అవుతుందన్నారు.
జన చైతన్యం మేనేజింగ్ డైరెక్టర్ వాండ్రాశి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా పత్రిక విలువలను కాపాడుకోవడానికి జన చైతన్యం మరొక ముందడుగు వేయనుందన్నారు. అదేవిధంగా పలువురు పాత్రికేయులు, మీడియా ఛానల్స్ పని చేస్తున్న రిపోర్టర్లు భవిష్యత్ జర్నలిజం ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై పలు సూచనలు చేశారు.
అనంతరం పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సేవలందిస్తున్న మీడియా మిత్రులకు ప్రశంసా పత్రం, జన చైతన్యం తరఫున జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యాంజలి స్కూల్స్ అధినేత పుప్పాల శ్రీనివాసరావు, ఆర్టీఏ యాక్టివిస్ట్ చిన్ని రూప్ నాథ్, సీనియర్ పాత్రికేయులు యేమినేని వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
