నేలపట్ల చేనేత సంఘం పీఐసీ కమిటీ పదవీకాలం పొడిగింపు

నేలపట్ల చేనేత సంఘం పీఐసీ కమిటీ పదవీకాలం పొడిగింపు

  • త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలి
  • పీఐసీ చైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాస్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా నేలపట్ల పద్మశాలి చేనేత సహకార సంఘం ప్రస్తుత పర్సన్-ఇన్-ఛార్జ్ (పీఐసీ) కమిటీ పదవీకాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు (ఏడీ) ఎం. శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర చేనేత, వస్త్ర పరిశ్రమల కమిషనర్ ఆదేశాల మేరకు తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964లోని సెక్షన్ 32(7)(ఏ)(ఐ) ప్రకారం ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆగస్టు 9 వరకు గడువు
​తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుత పీఐసీ కమిటీ పదవీకాలం ఈ ఏడాది మే 10 నుండి ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగనుంది. సంఘ పరిపాలన సజావుగా సాగడానికి, నేత కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి ఈ గడువును పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.

త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలి : పీఐసీ చైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాస్
​పీఐసీ కమిటీ గడువు పొడిగింపు పై హర్షం వ్యక్తం చేస్తూనే, సంఘానికి వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని పీఐసీ చైర్మన్ పిళ్లలమర్రి శ్రీనివాస్, సంఘ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సకాలంలో ఎన్నికలు జరిపి, కొత్త పాలకవర్గానికి బాధ్యతలు అప్పగించాలని వారు కోరారు.