Andhra Pradesh Temples | మనమిత్రతో 21 ప్రధాన ఆలయాలకు భారీ ఆదాయం

Andhra Pradesh Temples | మనమిత్రతో 21 ప్రధాన ఆలయాలకు భారీ ఆదాయం

Andhra Pradesh Temples | ఆదాయంలో శ్రీకాళహస్తి ఆలయం అగ్రస్థానం
30 శాతం టికెట్లు వాట్సాప్ ద్వారానే బుకింగ్
భక్తుల కోసం ప్రత్యేక మనమిత్ర సేవా కేంద్రాలు

Andhra Pradesh Temples | అమరావతి, ఆంధ్రప్రభ: ప్రజలకు వాట్సాప్ ద్వారానే అన్ని సేవలు అందించాలన్న సదాశయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు ప్రధాన ఆలయాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయం మినహా రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలోని 21 ప్రధాన ఆలయాలకు మనమిత్ర ద్వారా దర్శనం, సేవల టికెట్ల బుకింగ్ చేసుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ తరహా సేవలతో ఇప్పటి వరకు రూ.22.26 కోట్ల ఆదాయం సమకూరింది. మే 11వ తేదీ నుంచి జూన్ 11 వరకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ ఆలయాలకు రూ.12.91 కోట్ల ఆదాయం సమకూరింది.

ఆరు ఆలయాలు టాప్..

21 ఆలయాల్లో ఆరు ప్రధాన ఆలయాలకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అధిక ఆదాయం సమకూరింది. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి నెల రోజుల్లో రూ.3.39 కోట్ల మేర ఆదాయం సమకూరగా, శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయానికి రూ.2 కోట్లకు పైగా ఆదాయం లభించింది.

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి రూ.1.77 కోట్లు, ద్వారకాతిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రూ.1.54 కోట్లు, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి రూ.1.53 కోట్లకు పైగా, సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి రూ.1.04 కోట్లు, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి నెలలో రూ.66.11 లక్షల ఆదాయం మనమిత్ర ద్వారా వచ్చింది.

30 శాతం టికెట్లు మనమిత్ర ద్వారానే

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో 30 శాతం మేర దర్శనం, సేవల టికెట్లు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే బుక్ అవుతున్నాయి. ఆలయాలు దర్శించాలనుకుంటున్న ప్రజానీకానికి మనమిత్ర చాలా హాయిగా మారింది. మామూలుగా అయితే ఆలయాల వద్ద రద్దీలో దర్శనం, సేవా టికెట్ల కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చేది.

ఇప్పుడు అలా కాకుండా భక్తులు తమ చేతిలోని సెల్‌ఫోన్‌లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కేవలం “హాయ్” అని మెసేజ్ పంపితే చాలు, వారు వెళ్లాలనుకున్న ఆలయం వివరాలు, అక్కడ దర్శనం, సేవా టికెట్ల అందుబాటు అందులో చూపిస్తుంది. వాట్సాప్‌లోనే దర్శనం, సేవా, తలనీలాల టికెట్లు బుక్ చేసుకుని వాటి పీడీఎఫ్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.

మనమిత్ర సేవా కేంద్రాలు

రాష్ట్రంలోని కొన్ని ఆలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా మనమిత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఈ సేవా కౌంటర్ల వద్దకు వెళ్లి, అక్కడ మనమిత్ర భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్లలో త్వరితగతిన దర్శనం ముగించుకుని వచ్చేస్తున్నారు.