12parking spaces | మోదీ సభ.. ట్రాఫిక్ ఆంక్షలు
12parking spaces | మోదీ సభ.. ట్రాఫిక్ ఆంక్షలు
12parking spaces | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఇవాళ హైదరాబాద్ సిటీలో ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ రోజు సాయంత్రం సభ నిర్వహణ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. వీవీఐపీ కాన్వాయ్‌లు, ప్రజల రాకపోకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో వాహనాల దారి మళ్లింపునకు చర్యలు చేపడుతున్నారు. సభకు వచ్చే వారి కోసం 12 ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు.పరేడ్ గ్రౌండ్ పరిసరాలకు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు సభా ప్రాంగణానికి వెళ్లే మార్గాల్లో భారీ వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై నిషేధం ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపివేస్తే టోయింగ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. అత్యవసర సేవల వాహనాలను పరిస్థితిని బట్టి అనుమతి ఉంటుందని, వాహనదారుల సహాయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 8712662999 సంప్రదించాలని సూచించారు.
ట్రాఫిక్ పోలీసుల సూచనలు:
బేగంపేట్ నుంచి సంగీత్ జంక్షన్ వైపు వెళ్లేవారు ప్యారడైజ్, పట్నీ మీదుగా క్లాక్‌టవర్ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. బేగంపేట్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనదారులు సెయింట్ జాన్స్ రోటరీ, ఏఓసీ మార్గం ద్వారా వెళ్లాలంటున్నారు. బాలానగర్ నుంచి వచ్చేవారు అమీర్‌పేట్, పంజాగుట్ట మీదుగా లేదా రసూల్‌పురా, మినిస్టర్ రోడ్ ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించాలని వివరించారు. ట్యాంక్‌బండ్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే ప్రయాణికులు సీటీవో, తాడ్‌బండ్, డైమండ్ పాయింట్ మార్గాలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు మెట్రో రైలును ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
