Telegram NEET | నీట్ రీ-ఎగ్జామ్ వరకు నిషేధం కొనసాగింపు
Telegram NEET | నీట్ రీ-ఎగ్జామ్ వరకు నిషేధం కొనసాగింపు
టెలిగ్రామ్ పిటిషన్ కొట్టివేత
Telegram NEET | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ వేదిక టెలిగ్రామ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షలను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్రం టెలిగ్రామ్‌పై విధించిన పరిమితులు సమంజసమేనని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో కేంద్రం అమలు చేస్తున్న ఆంక్షలు యథాతథంగా కొనసాగనున్నాయి.
నీట్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారం, అక్రమ కార్యకలాపాలను అరికట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై ఈ నెల 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. హైకోర్టు తాజా తీర్పుతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి న్యాయపరమైన మద్దతు లభించినట్లైంది. మరోవైపు టెలిగ్రామ్ వినియోగదారులు, నిర్వాహకుల్లో ఈ తీర్పు చర్చనీయాంశంగా మారింది.
