Ethanol Vehicles | కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ

Ethanol Vehicles | కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ

Ethanol Vehicles |100 శాతం ఇథనాల్ వాహనాలకు మార్గం సుగమం
ఇథనాల్ వినియోగానికి చట్టబద్ధత కల్పించినట్లు వెల్ల‌డి
త్వరలో మార్కెట్లోకి 100% ఇథనాల్‌తో నడిచే కొత్త వాహనాలు

Ethanol Vehicles |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో 100 శాతం ఇథనాల్‌ను ఇంధనంగా ఉపయోగించే వాహనాలకు చట్టబద్ధత కల్పించే ఫైల్‌పై తాను సంతకం చేసినట్లు తెలిపారు. ఇథనాల్ ఆధారిత రవాణా వ్యవస్థకు ఇది కీలక ముందడుగుగా నిలుస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, స్వదేశీ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాగన్‌ఆర్ మోడల్‌ను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కలిసి ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రానున్న నెలన్నర కాలంలో టయోటా, సుజుకి, ఎంజీ, హ్యుందాయ్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు కూడా 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు గడ్కరీ వెల్లడించారు.

ఇథనాల్‌ను ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించాలనే ఆలోచనను తాను గతంలో ప్రస్తావించినప్పుడు చాలామంది సందేహాలు వ్యక్తం చేశారని, అయితే ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో పెట్రోల్‌కు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఇథనాల్ నిలుస్తుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *