ఆంధ్రపభ ప్రతినిధి, భూపాలపల్లి : అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని, రాష్ట్రం కోసం విలువైన ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ఉజ్వలంగా స్మరించుకోవాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ పొందెం వీరయ్య అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య ముఖ్య అతిథిగా హాజరై భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… శుభకార్యం తలపెట్టేటప్పుడు దేవుడిని తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకోవడం మన ధర్మం అన్నారు. అది వారి త్యాగానికి మనం ఇచ్చే గొప్ప గౌరవమన్నారు. జై తెలంగాణ.. ఇది నినాదం కాదు.. యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస అంతేకాదు.. అస్తిత్వం, ఆరాటం, పోరాటం, ఆత్మగౌరవం, చైతన్యం, భావోద్వేగం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన త్యాగధనులకు వేల వేల వందనాలు.. అరవై ఏండ్ల తెలంగాణ అస్తిత్వ ఉద్యమాల్లో వారి పోరాటం, అమరం, అజరామరం.. వారి త్యాగం, వారి త్యాగ స్ఫూర్తి నిరూపమానం అన్నారు. జీవితాన్ని త్యాగం చేయడమంటే మాటలు కాదు. అయినా ఏండ్ల తెలంగాణ కలను నిజం చేయడం కోసం వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు. నావల్లనైనా తెలంగాణ రాష్ట్రం రావాలి అని విద్యార్థి శ్రీకాంతాచారి, పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్, యాదిరెడ్డిలాంటి వందలమంది ప్రాణాలర్పించారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకుంది కేవలం 459 మందే అని గత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.. కానీ ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమంలో 1200మందికి పైగా ఉద్యమకారులు ప్రాణాలర్పించారన్నారు. బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో వారి ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, వారు కలలు కన్న తెలంగాణ పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. వందలాది అమరుల త్యాగఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. వారి స్ఫూర్తి నిత్యం మదిలో మెదిలేలా వీరుల త్యాగం భవిష్యత్ తరాలకు తెలిపేలా మనందరం సమిష్టి గా కృషి చేయాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్, పొదెం వీరయ్య పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డిఓ రవి, ఏఎస్పి నవీన్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.