లార్డ్స్‌లో సిరీస్ డిసైడర్.. రోహిత్-కోహ్లీలకు చివరి మ్యాచ్?
- నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు భారత్–ఇంగ్లండ్ మూడో వన్డే
- సిరీస్ కోసం ఇరు జట్ల పోటీ..
- చివరిసారిగా ఇంగ్లండ్ గడ్డపై రోహిత్-కోహ్లీ జోడీ?
ఆంధ్రప్రభ : భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో విజేతను తేల్చే మూడో, చివరి మ్యాచ్ ఆదివారం చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. భారత్‌కు సిరీస్ గెలవాలన్న పట్టుదల ఉంటే.. ఇంగ్లండ్ మాత్రం సొంతగడ్డపై విజయంతో 2027 ప్రపంచకప్ సన్నాహకాలకు శుభారంభం చేయాలని భావిస్తోంది.
అయితే ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. భారత దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇంగ్లండ్‌లో ఆడే చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావొచ్చనే ప్రచారం…. అభిమానుల్లో భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. రోహిత్ వన్డే భవిష్యత్తుపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తల నేపథ్యంలో లార్డ్స్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.
రోహిత్‌కు ఇదే కీలక పరీక్ష
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొలి వన్డేలో 11 పరుగులు, రెండో మ్యాచ్‌లో 26 పరుగులకే పరిమితమయ్యాడు. బర్మింగ్‌హామ్, కార్డిఫ్ పిచ్‌లు బ్యాటింగ్‌కు అంతగా అనుకూలంగా లేకపోయినా, రోహిత్ ఆటతీరు మాత్రం అభిమానులను నిరాశపరిచింది. అయితే శనివారం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పర్యవేక్షణలో రోహిత్ తీవ్రంగా సాధన చేశాడు. నెట్స్‌లో అతని షాట్లు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించాయని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. సిరీస్‌ను నిర్ణయించే మ్యాచ్ కావడంతో రోహిత్ తన అసలైన ఆటను బయటకు తీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
కోహ్లీ, గిల్‌పై భారీ అంచనాలు..
యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. తొలి వన్డేలో 80 పరుగులు చేసిన గిల్, రెండో మ్యాచ్‌లో కూడా 31 పరుగులతో జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన విరాట్ కోహ్లీ, రెండో వన్డేలో 65 పరుగులతో తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 66 పరుగులతో ఆకట్టుకున్నా, మధ్య ఓవర్లలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టును దెబ్బతీసింది. కీలక సమయంలో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బ్యాటర్ లేకపోవడం రెండో వన్డేలో పరాజయానికి కారణమైంది.
వాషింగ్టన్ సుందర్ గాయం.. తుది జట్టులో ఎవరు?
రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తూ హామ్‌స్ట్రింగ్ గాయపడిన వాషింగ్టన్ సుందర్ మూడో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో విదర్భ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే జట్టులోకి వచ్చాడు. అయితే తుది జట్టులో హర్ష్‌కు అవకాశం ఇస్తారా? లేక కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తారా? అనేది జట్టు యాజమాన్యం నిర్ణయించాల్సి ఉంది. మరోవైసు అనారోగ్యంతో రెండో వన్డేకు దూరమైన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. శనివారం నెట్స్‌లో ఆయన బ్యాటింగ్ సాధన చేయడం భారత్‌కు శుభసూచకంగా మారింది.
జో రూట్‌పై ఇంగ్లండ్ ఆశలు
రెండో వన్డేలో అజేయంగా 99 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించిన జో రూట్ మరోసారి ఆ జట్టు ప్రధాన ఆశగా నిలిచాడు. ఇటీవల మూడేళ్లుగా వన్డేల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్న ఇంగ్లండ్.. ప్రపంచ నంబర్-1 భారత్‌పై సిరీస్ గెలిస్తే 2027 ప్రపంచకప్ దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది.
మిడిలార్డర్ పై ఆందోళన..
ఈ సిరీస్‌లో ఇరు జట్లకూ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పెద్ద సమస్యగా మారింది. తొలి వన్డేలో ఇంగ్లండ్ 61 పరుగులకు వికెట్ లేకుండా ఉన్న స్థితి నుంచి 80/5కి కుప్పకూలగా, రెండో వన్డేలో భారత్ 178/3 నుంచి 193/7కి పడిపోయింది. ముఖ్యంగా షార్ట్‌పిచ్ బంతులను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది.
లార్డ్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కేవలం సిరీస్ విజేతను నిర్ణయించడానికే కాదు.. భారత క్రికెట్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇంగ్లండ్‌లో చివరిసారి కలిసి ఆడే మ్యాచ్ కావొచ్చనే భావన కూడా అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో లార్డ్స్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు తమ ముద్ర వేస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది.
