july19sunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

july19sunday2026
july19sunday2026

july19sunday2026 | జూలై 22, 1947. దేశం ఇంకా అధికారికంగా స్వాతంత్ర్యం పొందలేదు. మరో 24 రోజుల్లో బ్రిటిష్ పాలన ముగియబోతోంది. కానీ అంతకంటే ముందే దేశం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అదే… తనను ప్రపంచానికి పరిచయం చేసే ముఖచిత్రాన్ని ఎంచుకుంది. ఆ రోజు రాజ్యాంగ సభ భారత జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది. అందుకే ప్రతి ఏడాది జూలై 22ను జాతీయ పతాక ఆమోద దినోత్సవంగా గుర్తు చేసుకుంటాం.

నిజానికి జెండా అనేది కేవలం ఒక వస్త్రపు ముక్క కాదు. యుద్ధంలో సైన్యాన్ని ముందుకు నడిపించే ధైర్యం, కష్టాల్లో ప్రజలను ఒక్కటిగా నిలబెట్టే విశ్వాసం, భావితరాలకు దిశానిర్దేశం చేసే విలువల సమాహారం. భారత త్రివర్ణ పతాకం కూడా అలాంటిదే.

మూడు రంగులు… కానీ ఒక్కటే సందేశం july19sunday2026

చాలా మంది ఇప్పటికీ ఒక అపోహలో ఉంటారు. కాషాయం ఒక మతాన్ని, ఆకుపచ్చ మరో మతాన్ని సూచిస్తాయని. కానీ అది అధికారిక అర్థం కాదు.

పతాకంలోని కాషాయ రంగు త్యాగం, ధైర్యం, నిస్వార్థ నాయకత్వానికి ప్రతీక. అధికారం అంటే అధికారం కోసం కాదు… ప్రజాసేవ కోసం అన్న సందేశాన్ని అది గుర్తు చేస్తుంది.

తెలుపు రంగు సత్యం, శాంతి, పారదర్శకతకు చిహ్నం. దేశం ఎంత శక్తివంతంగా ఎదిగినా, నైతికత దారి తప్పకూడదని అది చెబుతుంది.

ఆకుపచ్చ రంగు భూమి, వ్యవసాయం, ప్రకృతి, అభివృద్ధి, జీవనాధారాన్ని సూచిస్తుంది. భారత భవిష్యత్తు ప్రకృతితో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తుంది.

ఈ అర్థాలను 1947లో రాజ్యాంగ సభలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంతో స్పష్టంగా వివరించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఈ రంగులకు ఎలాంటి మతపరమైన అర్థం లేదని సభలో స్పష్టం చేశారు.

పింగళి వెంకయ్య గారు జాతీయ పతాక రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. కానీ మనం చూస్తున్న త్రివర్ణ పతాకం ఒక్కరోజులో రూపొందలేదు.

మొదట ఆయన రూపొందించిన నమూనాలో రెండు రంగులే ఉన్నాయి. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆయన ఆ నమూనాను మహాత్మా గాంధీకి చూపించారు. అప్పుడు గాంధీజీ మధ్యలో తెలుపు రంగు చేర్చాలని, దానిపై చరఖా ఉండాలని సూచించారు. తెలుపు అన్ని వర్గాలకు సమాన స్థానం, శాంతిని సూచించాలని ఆయన భావించారు. ఆ సూచనతోనే త్రివర్ణ రూపానికి పునాది పడింది.

చరఖా ఎందుకు పోయింది? అశోక చక్రం ఎందుకు వచ్చింది? july19sunday2026

ఇది కూడా చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయం.

స్వాతంత్ర్యం సమీపిస్తున్న సమయంలో జాతీయ పతాకం అందరికీ ఆమోదయోగ్యంగా, దేశమంతటికీ ప్రతీకగా ఉండాలని నిర్ణయించారు. చరఖా స్వాతంత్ర్య ఉద్యమానికి గొప్ప చిహ్నమే అయినప్పటికీ, జెండాకు రెండు వైపులా ఒకే విధంగా కనిపించేలా రూపకల్పన చేయడం సులభం కాలేదు.

అందుకే సారనాథ్ అశోక సింహస్థంభంపై ఉన్న ధర్మచక్రాన్ని మధ్యలో ఉంచాలని నిర్ణయించారు. 24 ఆకులున్న ఈ చక్రం ధర్మం, న్యాయం, నిరంతర చలనానికి ప్రతీకగా నిలిచింది. దేశం ఎప్పుడూ ముందుకు సాగాలని అది చెప్పే సందేశం.

పతాకాన్ని ఆమోదించింది ఎవరు?

1947 జూలై 22న జరిగిన రాజ్యాంగ సభ సమావేశంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పతాకాన్ని ఆమోదించాలని తీర్మానం ప్రవేశపెట్టారు.

ఆ సమావేశానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. సభలో సర్వేపల్లి రాధాకృష్ణన్, సరోజిని నాయుడు, ఫ్రాంక్ ఆంథోనీ, గోవింద్ దాస్ తదితరులు పతాకాన్ని ప్రశంసిస్తూ ప్రసంగించారు. చివరకు సభ మొత్తం నిలబడి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

వారికి ఆ అధికారం ఎలా వచ్చింది?

ఆ రోజుల్లో భారత రాజ్యాంగం ఇంకా అమల్లోకి రాలేదు. కానీ 1946లో ఏర్పడిన రాజ్యాంగ సభ దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడమే కాకుండా, స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన కీలక జాతీయ నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కూడా కలిగి ఉంది. అందుకే జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆమోదించే నిర్ణయాన్ని అదే తీసుకుంది.

అంతకుముందు జెండా ఎలా ఉండేది?

1906లో కలకత్తా పతాకం, 1907లో భికాజీ కామా విదేశాల్లో ఎగురవేసిన పతాకం, 1921లో పింగళి వెంకయ్య రూపొందించిన నమూనా, 1931లో కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం… ఇలా భారత జాతీయ పతాకం ఎన్నో మార్పులు చూసింది.

1931లోని పతాకంలో మధ్యలో చరఖా ఉండేది. 1947లో అదే స్థానంలో అశోక చక్రం వచ్చింది. రంగులు మాత్రం కొనసాగాయి.

ఇప్పటివరకు ఎందుకు మార్చలేదు? ఇకపై మారుస్తారా?

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎన్నో రాజకీయ మార్పులు జరిగాయి. అయినా జాతీయ పతాకం మాత్రం మారలేదు.

ఎందుకంటే అది ఏ ఒక్క ప్రభుత్వానిదీ కాదు. ఏ ఒక్క పార్టీదీ కాదు. అది భారతదేశానిదే.

చట్టపరంగా పార్లమెంట్‌కు మార్పులు చేసే అధికారం ఉన్నప్పటికీ, జాతీయ పతాకం కోట్లాది భారతీయుల భావోద్వేగాలతో ముడిపడి ఉంది. అందువల్ల దాని రంగులు లేదా రూపాన్ని మార్చాలనే ఆలోచన ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ ముందుకు తీసుకురాలేదు. దేశవ్యాప్తంగా కూడా అలాంటి అవసరం వ్యక్తం కాలేదు.

భావితరాలకు త్రివర్ణం చెప్పే మాట

ధైర్యంగా ఉండు.
సత్యం వైపు నడువు.
ప్రకృతిని కాపాడు.
నిలిచిపోకు… ముందుకు సాగు.

అందుకే మధ్యలో చక్రం ఉంది. అది తిరుగుతూనే ఉంటుంది. ఆగిపోతే జీవితం ఆగిపోతుంది. దేశం కూడా ఆగిపోతుంది.

త్రివర్ణ పతాకం ప్రతి ఉదయం ప్రభుత్వ కార్యాలయాలపై మాత్రమే కాదు… ప్రతి భారతీయుడి మనసులోనూ ఎగురుతూ ఉండాలని గుర్తు చేసే రోజు జూలై 22. అది ఒక జెండాను ఆమోదించిన రోజు మాత్రమే కాదు… ఒక దేశం తన ఆత్మకు రూపం ఇచ్చుకున్న రోజు కూడా.

click here to read more

సహనమే ఆయుధం


జీవితంలో ఒక్కోసారి మనకు సమస్యలు ఎదురవుతాయి. అంటే భౌతిక సమస్యలు కాదు.మానసిక సమస్యలు. సాధారణంగా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు మనం మానసికంగా బలహీన పడిపోతాం. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని డీలా పడిపోతాం. ఒత్తిడికి గురి అయి ఆందోళనతో మరిన్ని తప్పటడుగులు వేస్తాం.
కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే మనం ఎంత ఆందోళన పడితే ఆ సమస్య మనని అంత ఓటమి లోకి నెడుతుంది అని.
ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్ పొందాల్సిన టైంలో , విద్యార్థులకు కీలకమైన ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సిన టైంలో ఇలా ముఖ్యమైన విషయాల్లో మానసిక భయం , ఆందోళన సహజం గా కలుగుతూ ఉంటాయి. మనం ఆ పరీక్షలో నెగ్గగలమా అని భయం కలుగుతూ ఉంటుంది.
కేవలం ప్రతిభ ఆధారంగా గెలవాల్సిన ఇలాంటి సందర్భాల్లో మానసికంగా దృఢంగా ఉండాలి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులకు , ప్రతికూల మనస్తత్వాలకు , ప్రతికూల మనుషులకు లొంగ కూడదు. అన్నిటినీ దూరంగా నెట్టేసి మన పని మనం సిన్సియర్ గా చెయ్యాలి.అప్పుడే విజయం లభిస్తుంది. అన్ని సమయాల్లో సహనంతో ప్రతికూల మనసుని గెలవడమే విజయం. అంతే కదా మిత్రులారా !!!

++++++++++++++++++++++++++++++++++++++

అశ్రద్ద తరంగాలు

ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా. దారి పక్కన రెండు మేకులు కనిపించాయి. అర్రే ఏదన్నా బండి, లేదా కారు, బస్ దీని మీద నుంచి వెళ్తే టైర్ పంక్చర్ అవుతుంది కదా, వెంటనే ఆ మేకులు వంగి చేతితో తీసి పక్కన పొదల్లో పడేశా.

ఆ రెండు మేకులు పొదల్లోంచి పైకి లేచి నవ్వాయి గట్టిగా. జెంటిల్మెన్ మమ్మల్ని తీశావు సరే! రెండు అడుగులు వెయ్యి, మా తమ్ముళ్ళు అన్నలు అనాథ మేకులు చాలా మంది ఉన్నారు అక్కడ. మరి వాటి సంగతి?

ఆశ్చర్యం!

అర్రే మేకులు నవ్వడం, మాట్లాడడం ఏమిటి, చిన్నయ సూరి కథల్లో జంతువులు మాట్లాడినట్టు అని నేను కొంచం ఆశ్చర్య పోయి, మూడు అడుగులు ముందుకు వేశా. నిజంగానే అక్కడ నాలుగు మేకులు, ఒక చిన్న ఊస, ఐదు సీసా పెంకులు కనిపించాయి. వాటి మీద పొరపాటున నా కాలు పడితే చెప్పు లోనించి గుచ్చుకుని నా రక్తం తాగేవి. చూసి బ్రతికిపోయా!

ఇంతలో…, విఠలాచార్య సినిమాలోలా…

సీసా పెంకులు గాల్లోకి లేచి, నిన్న రాత్రి తమ మరణం గురించి చెప్ప సాగాయి! మంచిగా సీసా రూపంలో, ఉంటూ, లోపల ఉన్న చల్లటి బీరును సంతోషంగా చప్పరిస్తూ జీవితం హాయిగా ఉంది అనుకుంటే…., అక్కడ పొదల పక్కన దావతు(మందు పార్టీ) లో కూర్చున్న నలుగురు పనికిమాలిన వెధవులు…, అందులో ఒకడు దొంగ, ఇంకొకడు గయ్యాళి పెళ్ళాం బాధితుడు….మరొకడి భార్య తన ముందే రోజు ప్రియుడితో పడుకుంటూ(కొన్నాళ్ళు రహస్యంగా చేసింది, తర్వాత బరి తెగించి, మొగుడు ముందే దుకాణం పెట్టింది)….ఏం. చేసుకుంటావో చేసుకో, నోరు మూసుకుని సంసారం చూసుకో, పిల్లలను చూసుకో, అలా పడి ఉండు…, లేదంటే 498A, గృహహింస, …, లేదా, గొంతు కోస్తా, లేదా అన్నంలో విషం పెట్టీ నిన్ను మీ అమ్మను, ఈ పిల్లలను కూడా చంపేస్తా అంటే… ఏం చెయ్యాలో తెలీక, తన భయాన్ని, అసమర్థతను, అసహాయతను తిట్టుకొని… , రోజంతా కష్టపడి, కొన్ని సార్లు చనిపోద్దాం అనుకుని, ధైర్యం చాలక, మనో వ్యాకులత తో ఇలా మందు ఆల్కహాల్ మత్తులో తేలుతూ…. స్నేహితులకు తన అసలు కథ చెప్పుకోలేక…ఉన్నవాడు ఒకడు.

ఇంకొకడు, పతివ్రత లాంటి భార్యను ఎంతో వేధించి, అనుమానించి, పెళ్ళాన్ని గొంతు కోసి చంపాడు. పిల్లలను అనాథ ఆశ్రమంలో వదిలి…., గమ్యం తప్పి, పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతూ…., లోపల బాధ పోవడం కోసం… ఇలా మందు కొట్టి, బీరు బాటిళ్లు పగల గొట్టి రోడ్డు మీద పడేస్తాడు. ఇంకా లోతులు ఉన్నాయి.

రోడ్డు మీద ప్రతీ చెత్త మనకు ఒక కథ చెబుతుంది! రాష్ డ్రైవింగ్ చేసే కారు, బైక్ వెనుక ఇంకో కథ ఉంటుంది. ప్రతీ ఆక్సిడెంట్ వెనుక ఒక ఇతిహాసం దాగి ఏడుస్తుంది!

రోడ్డు కాంట్రాక్టర్ మోసం, దోపిడీ నుండి, ప్రభుత్వాల అలసత్వం వరకు! ఎన్నో వాటి మీద చర్చ, పరిష్కారం, ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల, ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల బాధ్యత…!

మనకు అనవసరం లేదా అవసరం ఉన్నా మనకు సమయం లేదు. మీకు కావాలంటే సొంత పరిశోధనలతో తెలుసుకోవచ్చు.

సమాజంలో బాధ్యతా రాహిత్యం, విచ్చలవిడి తనం, నిర్భయంతో, నిర్లజ్జతో ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సవాల్ చేస్తూ స్వైర విహారం చేస్తున్న దుర్మహంకారం, దోపిడీ.

ఎవరు ఎవరినీ లెక్క చెయ్యని వైనం! ఈరోజు వరకూ నీ పక్కవాడు నీ స్నేహితుడు, కొలీగ్ …, కానీ రేపే వాడే నిన్ను నిండా ముంచేస్తాడు! నీ గొంతు కోసేస్తాడు!

పైగా సిగ్గు లేకుండా, నీ ముందుకు వచ్చి నేనే ఇదంతా చేశాను అని వికటాట్టహాసం చేస్తాడు! సాడిజం చూపిస్తాడు! నువ్వు బాధతో ఆత్మహత్య. చేసుకుంటే మళ్ళీ వాడే ఏం తేలినట్టు వచ్చి దండ వేస్తాడు!

బైక్ నడుపుతూ, దర్జాగా సిగరెట్లు కాలుస్తూ మీకు ఈ హైదరాబాద్ మహా నగరంలో ఎందరో కనిపిస్తారు! ఏమి ధైర్యం అది! ఒక్క పోలీసు పట్టుకోడు. సాటి నగర పౌరులుగా మనం అడిగితే, ఏం నీకెందుకు? అని రౌడీయిజం, గుండాయిజం! ఆ సిగరెట్టు యాష్ వెనుక బైకులు మీద వస్తున్న చిన్న పిల్లల కళ్లలో పడితే కళ్ళు పోతాయి! జీవితాంతం గుడ్డివాళ్ళు అవుతారు! దీనిని ఎవరు అరి కట్టాలి! పోలీసులు, పౌరుల బాధ్యత!

ప్రజలు ఎవరి కష్టాల్లో వారు నలిగిపోయి ఉన్నారు! ఈ సామూహిక బాధ్యతలు ఎవరు తీసుకోవాలి?

అలాగే, మీరు రోడ్డు మీద ఒక మైలు దూరం డేగ కళ్ళతో, లేదా చీమ కళ్ళతో వెతకండి, ఎన్ని మేకులు, వైరులు, ఐరెన్ తీగలు, కీలాలు, కటికలు, బీరు, విస్కీ సీసా ముక్కలు…ఇలా ఎన్నో!

మన దేశంలోనే ఎందుకు ఇలా! ప్రతీ రంగంలో ఇంతేనా?! ఎవరకు వారే యమునా తీరే! ప్రభుత్వాలు పెద్దలు, వారి కళ్ళు కేవలం పెద్ద పెద్ద విషయాలు మీద, కాళేశ్వరం…ఇలా! చిన్న విషయాలు కంటికి కనపడవు! కడుపు నింపవు కదా! చిన్న వర్షం పడితే నగరం మునిగి పోతుంది!

ఇలా ఎన్నో అశ్రద్ధ తరంగాలు! కుదిరిన వాటిని డాక్యుమెంట్ చేద్దాం, చర్చ చేద్దాం! ఈ అక్షరాలు, ఈ అక్షర సత్యాలు ఎవరు చూస్తారు! ఎవరు చదువుతారు? అంత ఓపిక ఎక్కడిది? చదివిన స్పందించే గొప్ప మనసు, బాధ్యత ఉండాలి కదా! ఈ ప్రపంచానికి, లేదా ఈ దేశానికి తల్లిగా, తండ్రిగా బాధ్యత మీరు తీసుకుంటారా?! కొన్ని నిజాలు, తరంగాల చర్చ చేద్దాం!
సత్యమేవ జయతే!

+++++++++++++++++++++++++++++++++++++++++++

రాజ భక్తికి నిదర్శనం…తిరుమలలో పల్లవోత్సవం

ఎన్నో రాజవంశాలతో భక్తి భావ బంధం కలిగిన తిరుమల క్షేత్రంలో మైసూరు రాజవంశం తో ఉన్న అనుబంధానికి గుర్తుగా పల్లవోత్సవం అనే ఉత్సవం ఏటా జరుగుతుంది. ఆ సందర్భంగా తిరుమలేశుడు ఉభయ దేవేరులతో తిరుమలలోని కర్ణాటక సత్రానికి ఊరేగింపుగా వెళ్లి కొలువు తీరి ఆ రాజవంశాన్ని అనుగ్రహించే సంప్రదాయం 400 ఏళ్లకు పైగా ఇప్పటికీ కొనసాగుతోంది
ఉత్తరాది నుంచి దక్షిణాదికి తరలివచ్చిన యదు వంశీకుడినని చెప్పుకునే యదుకుల వడయార్ విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా 1399లో మైసూరు రాజ సంస్థానాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు అయిదారు శతాబ్దాల పాటు రాచరిక పాలన కొనసాగించిన మైసూరు సంస్థానాధీశులందరూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పై అపారమైన భక్తి విశ్వాసాలను కనబరిచారు. పల్లవ రాజవంశీకులు చేసిన సేవల కొనసాగింపుగా మైసూరు రాజవంశీకులు తిరుమలేశునికి ఎన్నో స్వర్ణ, వజ్రాభరణాలను భక్తితో సమర్పించారు. తిరుమలేశుని వాహన సేవలకు కొన్ని వాహనాలను కూడా సమర్పించారు.. ఆ సంస్థానం ఆధ్వర్యంలో తిరుమలేశునికి ప్రతిరోజూ ఉదయం నవనీత హారతి సమర్పించడం, గర్భాలయంలో జ్యోతులకు నెయ్యి సరఫరా చేయడం వంటి సంప్రదాయాలను ఆ రాజ వంశీకులు ప్రారంభించారు.
మైసూరు రాజవంశీకులకు తిరుమలేశుని పై ఉన్న భక్తి కి నిదర్శనంగా మహారాజు జన్మదినం రోజును పురస్కరించుకుని ఏటా పల్లవోత్సవం పేరుతో ప్రత్యేకంగా ఉత్సవాన్ని నిర్వహించడం అప్పుడే మొదలైంది. ఆ ఉత్సవంలో భాగంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ ముగిసిన తరువాత శ్రీ దేవి, భూదేవి సమేతులైన మలయప్పస్వామి ఊరేగింపుగా తిరుమలలోని కర్ణాటక సత్రానికి చేరుకుంటారు . అక్కడ మైసూరు సంస్థానం రాజకుటుంబీకులు , కర్ణాటక ప్రభుత్వం ప్రతినిధులు స్వామివారికి సంప్రదాయ బద్ధమైన మర్యాదలతో స్వాగతం పలికి ఆహ్వానిస్తారు. ఆపై అక్కడ కొలువు తీరిన స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆస్థానం నిర్వహిస్తారు . అనంతరం స్వామి ఉభయదేవేరులకు పూజా కైంకర్యాలు నిర్వహించి హారతులిచ్చి, భక్తులకు ప్రసాద వితరణ చేసిన తరువాత తిరిగి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువస్తారు . మైసూర్ రాజవంశానికి తిరుమల క్షేత్రంతో ఉన్న భక్తి సంబంధానికి చిహ్నంగా ఆ సంస్థానం తరపున ఏటా కొన్ని ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా ఇటు తిరుమలకు , అటు తిరుచానూరుకు పూజా సామాగ్రికి సమర్పించడం, ఆ రాజవంశం పేరున ప్రత్యేక హారతులు ఇవ్వడం వంటి సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ఓం నమో వేంకటేశాయ