అక్రమ ఇసుక రవాణాపై అటవీ శాఖ ఉక్కుపాదం
జన్నారం, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై అటవీ శాఖ ఉక్కుపాదం మోపింది. ఇందన్‌పల్లి రేంజ్ పరిధిలోని భర్తన్‌పేట ఫారెస్ట్ సెక్షన్‌లో అడవిలోని వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఇందన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి (ఎఫ్‌ఆర్‌ఓ) గోదారి లక్ష్మీనారాయణ తెలిపారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి, సెక్షన్, బీట్ అధికారులు విజయ్‌కుమార్, హన్మంతరావు, శేషారాం, మక్బూల్, పొచయ్య, స్వామి, బేస్ క్యాంప్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ట్రాక్టర్లపై కేసు నమోదు చేసి రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వం అనుమతించిన ఇసుక రీచ్‌ల నుంచే ఇసుకను వినియోగించాలని సూచించారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం అవసరమైన నిధులు అందిస్తోందని, ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని వాగులు, అటవీ ప్రాంతాల నుంచి ఇసుక తరలించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
కొంతమంది స్వలాభం కోసం అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి అటవీ సంపదను దెబ్బతీస్తున్నారని, దీనివల్ల ప్రజల్లో అటవీ శాఖపై అపోహలు ఏర్పడుతున్నాయని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల పరిరక్షణలో ప్రజలు అటవీ శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
