కౌలేపల్లి వంతెనపై టాటా ఏస్ వాహనం దగ్ధం

శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ సమీపంలోని కౌలేపల్లి వంతెనపై శుక్రవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ (ప్యాసింజర్ మినీ వ్యాన్ ) వాహనం వంతెనపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వాహనం మొత్తం వ్యాపించి, దట్టమైన నల్లటి పొగ పరిసర ప్రాంతాన్ని కమ్మేసింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపి, ప్రయాణికులను కిందకు దింపడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనతో హైవేపై వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయి అస్థిపంజరంలా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో కొంతసేపు హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాద సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే విషయం. కదిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.