హాస్టళ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోండి

  • మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిని కోరిన ఎమ్మెల్యే కొలికపూడి
  • సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై వినతిపత్రం
  • అవసరమైన ప్రాంతాల్లో కొత్త హాస్టళ్ల మంజూరుపై ప్రతిపాదనలు
  • అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ
  • తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపైనా విస్తృత చర్చ

తిరువూరు, ఆంధ్రప్రభ: తిరువూరు నియోజకవర్గ పరిధిలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిని కోరారు. మంత్రి కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితిని వివరించారు.

హాస్టల్ భవనాలకు అవసరమైన మరమ్మతులు, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, ఫర్నిచర్ వంటి మౌలిక వసతులను మెరుగుపర్చాల్సిన అవసరాన్ని వివరించారు. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న ప్రాంతాల్లో కొత్త సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మంజూరు చేయాలని కోరుతూ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి వినతిపత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించడం ద్వారా వారి విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఎమ్మెల్యే వివరించారు.

వినతిపత్రంపై స్పందించిన మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు, అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు శాఖాపరంగా తగిన చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి, ఎమ్మెల్యే మధ్య విస్తృతంగా చర్చ జరిగినట్లు వెల్లడించారు.