సినీ సిటీగా హైదరాబాద్ !!
- టామ్ హాలండ్ సినిమాకు రికార్డు రెస్పాన్స్
భాషతో సంబంధం లేకుండా మంచి సినిమా వస్తే చాలు.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, హాలీవుడ్ అనే తేడా లేకుండా థియేటర్లకు పరుగులు తీసే ప్రేక్షకులు హైదరబాద్ లో ఉన్నారు. మంచి సినిమా ఎక్కడి నుంచైనా వచ్చినా గుండెలకు హత్తుకుని ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు. సినిమాపై అపారమైన అభిమానం చూపుతున్న హైదరాబాద్‌వాసులు.. ఇప్పుడు ఆ ప్రేమను ప్రపంచ సినీ పరిశ్రమకూ చాటుతున్నారు. తాజాగా ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ వంటి హాలీవుడ్ చిత్రం దేశంలోనే అత్యధిక టికెట్ అమ్మకాలు, ప్రేక్షకుల హాజరును హైదరాబాద్‌లో నమోదు చేయడం.. ఈ నగరం నిజంగానే ‘సినీ సిటీ’గా ఎదిగిందనే విషయాన్ని రుజువు చేసింది. వల్లే హైదరాబాద్ ఇప్పుడు భారత సినీ మ్యాప్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హాలీవుడ్ సూపర్‌హీరో చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారత బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొడుతున్న ఈ చిత్రం.. భారత్‌లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ విజయగాథలో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలను వెనక్కి నెట్టి అత్యధిక ప్రేక్షకుల హాజరు (ఫుట్‌ఫాల్స్), అత్యధిక టికెట్ విక్రయాల పరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది ప్రేక్షకులు స్పైడర్ మ్యాన్ ను చూసేందుకు థియేటర్లకు తరలివచ్చారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నారులు ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ప్రసాద్స్ ఐమాక్స్ (Prasad’s IMAX), ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas), అల్లు సినిమాస్ డాల్బీ (Allu Cinemas Dolby) వంటి అత్యాధునిక థియేటర్లు ఉండటం కూడా హైదరాబాద్‌ను దేశంలోని ప్రముఖ సినీ గమ్యస్థానంగా నిలబెట్టింది.


బిర్యానీ రాజధాని మాత్రమే కాదు.. సినీ రాజధానీ కూడా..!
ఇప్పటికే భారత్ బిర్యానీ రాజధానిగా పేరొందిన హైదరాబాద్.. ఇప్పుడు సినీ ప్రేక్షకుల రాజధానిగానూ తన ప్రత్యేకతను చాటుతోంది. అందుబాటు ధరల్లో టిక్కెట్లు, అత్యాధునిక థియేటర్లు, సినిమాలంటే అమితమైన ఆసక్తి చూపే ప్రేక్షకులతో దేశంలోనే అత్యధిక టికెట్ అమ్మకాలు సాధించిన నగరంగా మరోసారి హైదరాబాద్ తన ప్రత్యేక స్థానాన్ని నిరూపించుకుంది.

అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రేక్షకుల సంఖ్యలో దేశంలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ కలెక్షన్లలో మాత్రం హైదరాబాద్ వెనుకంజలో ఉంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో అమలులో ఉన్న నియంత్రిత టికెట్ ధరలే. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో టికెట్ ధరలు అధికంగా ఉండటంతో అక్కడ వసూళ్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ తక్కువ ధరల కారణంగా హైదరాబాద్‌లో కలెక్షన్లు కొంత తక్కువగా కనిపిస్తున్నా.. అమ్ముడైన టికెట్ల పరంగా మాత్రం దేశంలో నంబర్-1 స్థానాన్ని దక్కించుకుంది.
టామ్ హాలండ్‌కు తెలుగు హీరో స్థాయి స్వాగతం
తెలుగు రాష్ట్రాల్లో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమా విడుదలను అభిమానులు పండుగలా జరుపుకుంటున్నారు. థియేటర్లలో టామ్ హాలండ్‌కు తెలుగు స్టార్ హీరోలకు ఇచ్చే తరహాలో స్వాగతం పలికారు. థియేటర్లలో ప్రత్యేక ఫ్యాన్ ఎడిట్స్, టైటిల్ కార్డులు ప్రదర్శించడం, కాగితాల వర్షం కురిపించడం, హర్షధ్వానాలతో సందడి చేయడం ఆకట్టుకుంది. కొన్ని థియేటర్లలో టామ్ హాలండ్‌ను “సూపర్ స్టార్ టామ్ హాలండ్.. యూత్ స్టార్ పీటర్ పార్కర్” అంటూ ప్రత్యేకంగా పరిచయం చేసే ఫ్యాన్ మేడ్ వీడియోలు ప్రదర్శించారు. మరికొన్ని చోట్ల స్పైడర్‌మ్యాన్‌ను ‘దేవరథ రైసార్’గా చూపించిన వీడియోలు అభిమానులను అలరించాయి.

బోనాల సంబరాల్లో స్పైడర్‌మ్యాన్ సందడి
తెలంగాణలో జరుగుతున్న బోనాల ఉత్సవాల నేపథ్యంలో స్పైడర్‌మ్యాన్ విడుదల కావడంతో వేడుకలకు మరింత రంగు చేరింది. కొన్ని థియేటర్లలో స్పైడర్‌మ్యాన్ వేషధారణలో అభిమానులు పెద్దపులి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. థియేటర్ యాజమాన్యాలు కూడా అభిమానుల కోసం ప్రత్యేక లైటింగ్, ఫ్యాన్ ఎడిట్స్ ప్రదర్శించి వేడుకలను మరింత ఆకట్టుకునేలా చేశాయి.
భారత్‌లో రూ.380 కోట్లకు పైగా.. ప్రపంచవ్యాప్తంగా 1.15 బిలియన్ డాలర్లు
జూలై 31న విడుదలైన ఈ చిత్రం తొలి వారంలోనే భారతదేశంలో రూ.380 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. నెట్ కలెక్షన్లు రూ.318 కోట్లను దాటగా, ఎనిమిదో రోజు నాటికి దేశీయ గ్రాస్ దాదాపు రూ.383 కోట్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1.15 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి 2026లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. అలాగే ప్రముఖ సమీక్షల వేదిక రోటెన్ టొమాటోస్లో ప్రేక్షకుల నుంచి 98 శాతం ఆడియన్స్ స్కోర్ సాధించి, ఇప్పటివరకు వచ్చిన అన్ని స్పైడర్‌మ్యాన్ చిత్రాల్లో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన సినిమాగా మరో రికార్డు సృష్టించింది.
